ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లాలో రెండు విడతల్లో, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 71 జడ్పీటీసీ, 710 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 71 మండలాల్లో 295 మంది అభ్యర్ధులు జడ్పీటీసీలుగా, 790 స్థానాల్లో 2,499 మంది అభ్యర్ధులు ఎంపీటీసీలుగా పోటీ పడ్డారు. ప్రస్తుతం వీరి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది.
కోర్టు పరిధిలో గగ్గళ్లపల్లి ఎన్నిక
ఇక మహబూబాబాద్ నగర్ జిల్లాలో ఒకటి, నాగర్ కర్నూల్లో రెండు, నారాయణపేట జిల్లాలో నాలుగు, జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు, వనపర్తి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీరంతా తెరాస పార్టీకి చెందిన వారే. ఇక నాగర్ కర్నూల్ జిల్లా గగ్గళ్లపల్లిలో తెరాస అభ్యర్ధి తనను బెదిరించి 10లక్షలు ఇచ్చి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించారని కాంగ్రెస్ అభ్యర్ధి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన త్రిసభ్య కమిటి ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ గగ్గళ్లపల్లి ఎంపీటీసీ ఎన్నికకు మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. దీనిపై తెరాస అభ్యర్ధి హైకోర్టును ఆశ్రయించగా... 8 వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది
ప్రశాంతంగా పోలింగ్
మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్ లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఐదు జిల్లాల్లో మూడు విడతల్లో సగటున 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో ఓటు వేసేందుకు వెళ్లిన సందడి రాజవర్థన్ రెడ్డి బ్యాలెట్ పత్రాలను చించివేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అచ్చంపేట మండలం బక్కలింగాయపల్లిలోని సిద్ధాపూర్ను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు 9 గంటల వరకు పోలింగ్‌ను బహిష్కరించారు.
పటిష్ఠ ఏర్పాట్లు
మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రాల్లో స్ట్రాంగ్ రూంలకు చేర్చారు. ఈ నెల 27న జరిగే ఓట్ల లెక్కింపు వరకూ స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాల వెల్లడి తర్వాత అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది.
ఇవీ చూడండి: మిషన్‌భగీరథను పరిశీలించనున్న కేంద్ర బృందం