ఖమ్మం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ ఇప్పటికే మోడల్ రహదారులుగా రూపుదిద్దుకున్నాయి. విశాల రహదారుల మధ్య డివైడర్ల ఏర్పాటు నగరం అభివృద్ధికి సూచికలుగా కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, ముఖ్య రోడ్ల వద్ద సుందరంగా తీర్చిదిద్దిన జంక్షన్లతో సరికొత్త అందాలను సంతరించుకుంది.
సుమారు 30 కిలోమీటర్లు..
నగరంలో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ విధానం దాదాపు అన్ని చోట్ల పూర్తి కావడం వల్ల నగర అందాలు మరింత ద్విగుణీకృతమవుతున్నాయి. నగరంతో పాటు దాదాపు 30 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకోసం ఇప్పటి వరకు దాదాపు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేశారు. దాదాపు 1,000 సెంట్రల్ లైటింగ్ పోల్స్ నిర్మించారు. 50 సెంటర్లలో హైమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన రహదారులన్నింటినీ ఆధునికీకరించే ప్రక్రియ చేపట్టారు. దాదాపు 30 కిలోమీటర్లు డివైడర్లు, కొన్ని చోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయడం వల్ల నగరం సరికొత్త అందాలను సంతరించుకుంది.
వెలుగుల జిగేల్..
సూర్యాపేట నుంచి ఖమ్మం నగరంలోకి ప్రవేశించే మార్గం నుంచి వైరా రహదారికి వెళ్లే వరకు నగరమంతా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణాలు ముచ్చట గొలుపుతున్నాయి. రాపర్తినగర్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు అక్కడి నుంచి బస్టాండ్ వరకు ఎక్కడ చూసిన సెంట్రల్ లైటింగ్ వెలుగులు జిగేల్‌మనిపిస్తున్నాయి. వైరా రోడ్డు మొత్తం సెంట్రల్ లైటింగ్, డివైడర్ల ఆధునికీకరణతో నగరానికి మరింత వన్నెలద్దుతోంది.
రాపర్తినగర్ నుంచి ఎన్జీవోస్ కాలనీ, బల్లేపల్లి ప్రధాన రహదారి, స్తఫానగర్ రహదారి, మమతా రోడ్డు నుంచి అల్లీపురం రహదారి, కాల్వొడ్డు నుంచి రంగనాయకుల గుట్ట, ఇందిరానగర్ రహదారి, ఇల్లెందు రహదారి నుంచి బైపాస్ రోడ్డు, లకారం నుంచి గొల్లగూడెం వరకు రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఇప్పటికే పూర్తవడం నగరానికి కొత్త కళను తీసుకొచ్చాయి. మరికొన్ని చోట్ల పనులు సాగుతున్నాయి. ఇటీవలే మరో రూ. 2 కోట్లతో మరికొన్ని చోట్ల బల్దియా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుడా నిధులతో బల్లేపల్లి నుంచి రఘునాథపాలెం వరకు మరో రూ. 2 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ల ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తి కావచ్చాయి.
నగరానికి వన్నే..
రాత్రి వేళల్లో నగర అందాలు మరింత వన్నె తెస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పాటు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫౌంటేన్లు నగరానికి మణిహారంగా నిలుస్తున్నాయి. ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్ రోడ్డు, లకారం సర్కిల్, కాల్వొడ్డు, గాంధీచౌక్, బోసు బొమ్మ సెంటర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్ ప్రాంతాల్లో ఫౌంటేన్ల నిర్మాణాలు ముచ్చట గొలుపుతున్నాయి. గతంలో కొన్ని కూడళ్లలో ఫౌంటేన్ నిర్మాణాలు చేపట్టగా కొత్తగా మరో 5 ప్రధాన కూడళ్లలో జంక్షన్ల నిర్మాణం చేపట్టారు. రాత్రివేళల్లో రాకపోకలు సాగించే వారికి ఈ నిర్మాణాలు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారు.
రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు ఖమ్మం వైపు చూసేలా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం. హైదరాబాద్ తర్వాత ఖమ్మం నగరం అనేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారులే కాకుండా అంతర్గత రహదారులను ఆధునికీకరించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత కార్యాచరణతో అభివృద్ధిని చేసి చూపిస్తామంటున్నారు.