NSUI PRESIDENT: ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(ఫిబ్రవరి 17న) సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో గాడిదకు కేసీఆర్ చిత్రపటం వేసి ఎన్ఎస్యూఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గాడిదను బల్మూరి వెంకట్ దొంగిలించాడని జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో తెరాస నేత ఫిర్యాదు చేశారు. 143, 153, 504, 379, 149 ఐపీసీ సెక్షన్, సెక్షన్ 67 ఐటీ యాక్ట్, సెక్షన్ 11 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బల్మూరి వెంకట్‌ను అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. జూపాకలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని హూజూరాబాద్‌లోని తన నివాసానికి వెళ్తుండగా వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వెంకట్ అసంతృప్తి..
అర్ధరాత్రి సమయంలో ముందస్తు సమాచారం లేకుండా అదుపులోకి తీసుకోవడంపై బల్మూరి వెంకట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పోలీసులు.. తెరాస నేతలు తనపై ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేస్తే ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఇవాళ ఉదయం... బల్మూరి వెంకట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ జమ్మికుంట పోలీస్‌స్టేషన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇల్లందకుంట పీఎస్‌కు తరలించారు.
ఇదీచూడండి: KCR Birthday Celebrations: ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు