నిర్వాసితులకు తగిన పరిహారం సహా వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా భూసేకరణ ప్రక్రియను కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారి విస్తరణపై కరీంనగర్‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రహదారి విస్తరణ కోసం రూపొందించిన అలైన్మెంట్ మ్యాప్‌ను పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా ఎక్కడెక్కడ బైపాస్ రోడ్లు నిర్మిస్తున్నారో తెలుసుకున్నారు. ఆర్ఓబీ(రోడ్డు ఓవర్ బ్రిడ్జ్), సర్వీస్ రోడ్లు, ఆర్యూబీ(రోడ్డు అండర్ బ్రిడ్జ్) నిర్మాణాలను చేపట్టే విషయంపై చర్చించారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే ప్రక్రియపైన సంబంధిత పీడీతో మాట్లాడారు.
ఆయా గ్రామాల పరిధిలో ప్రజాప్రతినిధులు, ప్రజల సూచనలనూ పరిగణలోకి తీసుకోవాలని.. రహదారి ప్రక్రియను ముందుకు సాగించాలన్నారు. సమీక్షలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిశోర్ రఘునాథ్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.
ఇదీ చూడండి: "గుస్సాడీ కనకరాజు'కు పద్మశ్రీ.. గిరిజన జాతికిచ్చిన పురష్కారం"