పర్యావరణ పరిరక్షణలో చెట్ల ప్రాముఖ్యత ఏ మేరకు ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా.. చాలా మంది మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం పక్కన పెడితే.. తమ అవసరాలకు అడ్డుగా ఉందని భావించి చెట్లను నరికేస్తుంటారు. వృక్షాల పరిరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా.. వాటిని తొలగించే వారు తమకు అదేం పట్టకుండా నరికేస్తూనే ఉన్నారు. కానీ.. కరీంనగర్లో మాత్రం ప్రకృతి ప్రేమికులు.. చెట్లను రక్షించడానికి ఎనలేని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంట్లో సభ్యునిలా..
సాధారణంగా.. ఎక్కడైనా కొత్తగా నిర్మాణాలు చేపడితే.. ఆ ప్రాంతంలోని చెట్లు తొలగించి చదును చేస్తారు. కానీ.. కరీంనగర్లో మాత్రం కొందరు వృక్షాలను రక్షించుకోవడానికి భవన నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించకుండా.. తమ ఇంట్లో సభ్యుడిలా భావిస్తూ వాటిని కాపాడుకుంటున్నారు.
స్లాబ్కే రంధ్రం
కరీంనగర్ జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో దశాబ్ధాల క్రితం నాటిన చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి. వాస్తవానికి అక్కడేదైనా నిర్మాణం చేపట్టాలంటే.. వృక్షాలను తొలగించాల్సిందే. చెట్లుంటే స్థలం వృథా అయ్యే అవకాశమున్నా.. పచ్చదనానికే ఓటు వేసిన వారు.. ఆ వృక్షాన్ని భవనంలోని ఓ భాగంగా మార్చేశారు. స్లాబ్ వేస్తే చెట్టు నరకాల్సి వస్తుందని.. ఆ ప్రాంతంలో రేకుల షెడ్తోనే సరిపెట్టుకున్నారు. మరోవైపు కొవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్లోనూ ఇదే తరహాలో వృక్షాన్ని రక్షించారు.
పచ్చదనానికి ప్రాముఖ్యత
అలుగునూరులోని జాప రత్నాకర్ రెడ్డి అనే ప్రకృతి ప్రేమికుడు.. చెట్టు కోసం ఇంటి స్లాబ్కే రంధ్రం చేశారు. ఇలా వృక్షాలను అడ్డొస్తున్నాయని నరికివేయకుండా.. వాటిని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే పర్యావరణం పచ్చగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హరిత హారంలో భాగంగా మొక్కలు నాటి చేతులు దులుపుకోవడం కాకుండా ఇప్పటికే ఉన్న పురాతన చెట్లను సంరక్షించుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.
- ఇదీ చదవండి : ఆహ్లాదం+ ఆరోగ్యం+ ఆధ్యాత్మికత= ప్రకృతి వనాలు