హుజూరాబాద్ ప్రజలెవరూ ఆందోళనకు(huzurabad byelection)గురికావద్దని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender)కోరారు. అంతిమంగా ధర్మం, న్యాయానిదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. బస్సుల్లో ఈవీఎం కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయన్న ఈటల.. అధికారుల తీరు పలు అనుమానాలకు తెరలేపిందన్నారు.
ఓట్లు వేసిన బాక్సులను మాయం చేయడం దుర్మార్గమన్నారు.. ఈటల రాజేందర్. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఈవీఎంల తరలింపులో పొరపాటు జరిగిందని కలెక్టర్ చెబుతున్నారని.. ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యమా? అంటూ అధికారులను నిలదీశారు. సీపీ, కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా తెరాస వ్యవహరించిందని ఆరోపించిన ఈటల.. డబ్బులు పెట్టి గెలిచే పద్ధతి మంచిది కాదన్నారు. ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని.. తనను ఓడించేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేశారని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఈటల ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
'కేసీఆర్.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. గెలవమనే భావనతో అనేక ఆకృత్యాలకు పాల్పడ్డారు. ఆరు నెలలుగా హుజూరాబాద్ పెనుగులాడింది. ధర్మాన్ని కాపాడుకొనేందుకు ఆరాటపడింది. దీన్ని నిలువరించేందుకు మా ఆడబిడ్డలు, అన్నలు సాహసం ప్రదర్శించారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది.'
- ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా అభ్యర్థి.
ఇదీచూడండి: Huzurabad by election news: ప్రైవేటు వాహనంలో వీవీప్యాట్ తరలింపు.. భాజపా, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన