Huzurabad TRS Clashes: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని తెరాస నాయకుల మధ్య అంతర్గత పోరు మొదలైంది. గతంలో వీణవంకలో సమ్మక్క - సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన నిర్వహణ కమిటీ విషయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు చేయడమే కాకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఇల్లందకుంట సీతారామాలయ ఛైర్మన్ పదవి వ్యవహారంలోనూ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.
జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గస్థాయిలో ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై వారంతా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన ఇల్లందకుంట సీతారామాలయ ఛైర్మన్ పదవి వ్యవహారంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వారికి పదవిని కట్టబెట్టారంటూ ఈ సమావేశంలో కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తిం చేసినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని.. కొత్తగా చేరినవారికి పదవిని అప్పగించడం సరైనది కాదని వారంతా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ తెరాసలో ఏదో రూపంలో అసంతృప్తి జ్వాలలు బయటపడటం పార్టీకి ఇబ్బందికర పరిణమిస్తోంది.