Union Cabinet Decisions On Natural Farming : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ.2481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నాటికి సుమారు కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. భూసార నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2019-20 నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 10 లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు. అంతేకాకుండా, పాన్ 2.0 ద్వారా పాన్‌కార్టు ఆధునికీకరణకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0కు రూ.2750 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిషన్ అనే కొత్త పథకానికి రూ.6000 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. పరిశోధనా వ్యాసాలు లేదా పత్రికలు పొందడానికి వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధన-అభివృద్ధి సంస్థల్లో చదువుకుంటున్న 1.8 కోట్ల మంది విద్యార్థులతో పాటు పరిశోధకులు, అధ్యాపకులకు లబ్ధి కలగనుందని వివరించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.3689 కోట్లతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్వివీ వైష్ణవ్ వెల్లడించారు.