హుజూరాబాద్ ఉప ఎన్నిక(Huzurabad By Election 2021)ల్లో నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేరుతో నలుగురు ఉన్నారు. భాజపా తరఫున ఈటల రాజేందర్ బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరు రోజున రాజేందర్ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారి ఇంటిపేర్లు కూడా ఈటల మాదిరిగానే ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్‌ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది, 43 మంది స్వతంత్రులతో పాటు మొత్తంగా 61 మంది 92 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు
హుజూరాబాద్ ఉప ఎన్నిక(Huzurabad By Election 2021)లో మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పోటీదారులు స్థానిక ఆర్డీవో కార్యాలయానికి తరలి వచ్చారు. తెరాస, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు ఇతర గుర్తింపు పొందిన పలు పార్టీల తరఫున కొందరు నామినేషన్లు వేయగా.. ఎక్కువ మంది స్వతంత్రులు ఇక్కడ బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపారు. ఈ నెల 7వ తేదీ వరకు 15 మంది తమ నామినేషన్లను ఎన్నికల అధికారి రవీందర్‌రెడ్డికి అందించగా ఆఖరు రోజున ఏకంగా 46 మంది దాఖలు చేశారు. ఇక్కడ పోటీ చేస్తామని ముందుకు వచ్చిన నిరుద్యోగులు, ఉపాధిహామీ క్షేత్రసహాయకుల్లో కొందరు శుక్రవారం నామినేషన్లను వేయగలిగారు. వీరిలో క్షేత్రసహాయకులు ఐదారుగురు ఉన్నట్లు తెలిసింది.
మూడు పార్టీల సందడి...
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం హుజూరాబాద్‌కు రావడంతో శ్రేణుల్లో సందడి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉదయం 11.55 నిమిషాలకు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిలు వెంట రాగా, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మధ్యాహ్నం 12.10 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణకు అవకాశముంది. ఆ తర్వాత పోటీలో ఎంతమంది ఉంటారనేది తెలియనుంది.