YS SHARMILA Fire on Kcr: ప్రభుత్వం 8 ఏళ్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని పూర్తి చేయకున్నా.. జిల్లా నాయకులు ఎందుకు ఐక్యం కావట్లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో కీలకమైన ప్రాజెక్టు విషయంలో నాయకులు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారో తెలపాలని కోరారు. తాను మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు, తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రులపై కేసులు నమోదు చేసే హక్కు సామాన్యులకు లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసి పాదయాత్ర ఆపాలని చూస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు.
మహిళను ఎదుర్కొనే ధైర్యం లేక శాసనసభాపతికి మంత్రి నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మంత్రి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. మహిళలను గౌరవించలేనప్పుడు మీకు పదవులు ఎందుకని ప్రశ్నించారు. రైతుల అవసరాలు తెలియని వ్యక్తి.. వ్యవసాయశాఖ మంత్రా అని నిలదీశారు. ఎమ్మెల్యేల, మంత్రుల అవినీతిపై చర్చకు సిద్ధమా అని షర్మిల సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల అవినీతిపై బహిరంగంగా మాట్లాడితే తప్పా అని షర్మిల ప్రశ్నించారు.
"పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తానన్నారు. ఎనిమిదేళ్లుగా ఒక్క ప్రాజెక్టు పూర్తికాకపోతే మాట్లాడకూడదా? జిల్లా నాయకులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయమని సీఎంను ఎందుకు అడగరు? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండని అడిగితే తప్పేంటి. నాపై ఎమ్మెల్యేలందరూ శాసనసభాపతికి ఫిర్యాదు చేశారు. ఇదే ఐకమత్యం నియోజకవర్గాల అభివృద్ధిపై ఎందుకు చూపరు? పోడుభూములపై ప్రశ్నించిన మహిళలను ఈడ్చుకెళ్లారు. ప్రజల పక్షాన నిలవాల్సిన ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి సూర్యాపేటలో తెరాస కార్యకర్తలా ప్రవర్తించారు. తాను మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు. ఇది ప్రజాస్వామ్యమా..? లేక తాలిబన్ ప్రభుత్వమా? అర్థం కావడం లేదు. కేసీఆర్‌కు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి. వైఎస్‌ఆర్‌ను కుట్ర చేసి చంపారు. నన్ను అదేవిధంగా కుట్ర చేసి చంపుతారు. అరెస్ట్‌లకు భయపడే వ్యక్తిని నేను కాను". - వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
ఇవీ చదవండి: