ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన దండు చైతన్య ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. ప్రముఖ ఫైనాన్షియల్ బ్యాంక్ జేపీ మోర్గాన్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా బెంగళూరులో ఉద్యోగం చేరాడు. సాఫీగా సాగుతూ ఉండే జీవితం... కానీ అతని మనసంతా పుట్టి, పెరిగిన ఊరు మీదే ఉండేది. డాలర్లతో జీవితం పరిపూర్ణం కాదనుకున్నాడు. వ్యవసాయ కుటుంబ నేపథ్యమున్న చైతన్యకు సొంతూరు వెళ్ళి వ్యవసాయాధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావించాడు. తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని తలిచాడు.
ఆలోచన వచ్చిందిలా..
బ్యాంకు పనిమీద వివిధ దేశాలు పర్యటించినప్పుడు వ్యవసాయ పద్ధతులు, ప్రజల ఆహారపు అలవాట్లు ఆలోచింపజేశాయి. భవిష్యత్తు అంతా చిరుధాన్యాలదే అనుకున్నాడు. అంతే తన ఉద్యోగం వదిలి సొంతూరు వచ్చి.. చిరుధాన్యాల వ్యాపారం వైపు దృష్టి మళ్ళించాడు.
అలా మొదలైంది...
బెంగళూరులో పని చేసేటప్పుడు స్నేహితులతో కలిసి వారాంతాపు సెలవులు గడిపేందుకు ఓ సారి కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్లోని డా. నారాయణరెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అక్కడే వారం రోజులపాటు శిక్షణ తీసుకున్నాు. ప్రముఖ శాస్త్రవేత్త డా.ఖాదర్ వలీ ఉపన్యాసాలు విని చిరుధాన్యాల మేలు గురించి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే వచ్చే షుగరు, బీపీ నుంచి తప్పించుకునేందుకు చిరుధాన్యాలే మంచి ప్రత్యామ్నాయమని భావించి .... చిరుధాన్యాలపై కొంత పరిశోధన సాగించి చివరికి శుద్ధి చేసే వ్యాపారంలోకి ప్రవేశించాడు. రాగులు, కొర్రలు, అండ్రు కొర్రలు, సజ్జలు, సామలు, ముడి ధాన్యాలు సేకరించి.. ఎగుమతులకు అనుకూలంగా శుధ్ధి చేస్తాడు. ప్రత్యేక ప్యాకింగ్‌లు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు.
ప్రోత్సహిస్తూనే లాభాల బాట..
రైతుల్లో అవగాహన పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న చైతన్య... స్థానిక రైతులను ప్రోత్సహించి చిరుధాన్యాలు సాగులో మెలకువలు వివరిస్తున్నాడు. విత్తనాలను ముందే ఇస్తూ.. వచ్చిన పంట మొత్తాన్నీ కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నాడు. బైబ్యాక్ విధానంతో రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఈ పరిశ్రమ రావడం వల్ల రోజూ పని దొరుకుతోందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొదట్లో మంచి ఉద్యోగం వదిలి వస్తామంటే చాలా ఆలోచించామని.. అయితే తన కుమారుడు చేసే పని ద్వారా ఈ ప్రాంతంలో చిరుధాన్యాల సాగు పెరిగే అవకాశం ఉంటుందని చైతన్య తండ్రి అంజిరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. చదువు ముగిసిన దగ్గర నుంచి ఉద్యోగ ప్రయత్నాలతోనే తలమునకలవుతున్న యువత... తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడి ఉంటున్నారంటున్నాడు చైతన్య. చిన్న ఆలోచన... చుట్టు పక్కల పరిస్థితులను బాగు చేస్తాయి... ఓ గట్టి ప్రయత్నం జీవితాన్ని మార్చేయగలదని ఈ యువకుడి ప్రయత్నాన్ని చూస్తే అర్థమవుతోంది.
ఇదీ చదవండి: జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి