సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో ఏపీ సీఐడీ అధికారులు.. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి రాత్రి 11 గంటలకు తీసుకువచ్చారు.
మిలటరీ నిబంధనల ప్రకారం ఆసుపత్రి ఎదుట ప్రత్యేక అంబులెన్స్‌ను ఆర్మీ అధికారులు ఏర్పాటు చేశారు. ఎస్కార్ట్ వాహనాల శ్రేణిని ఆసుపత్రి ఎదుటే నిలిపివేసి ప్రత్యేక అంబులెన్స్‌లో లోపలికి తీసుకెళ్లారు. ఎస్కార్ట్ వాహనంలో నుంచి దిగాక.. దూరం నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఎంపీ రఘురామ.
నేడు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు..
సుప్రీంకోర్టు ఆదేశానుసారం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్... రఘురామకృష్ణరాజు కంటే ముందే మిలటరీ ఆసుపత్రికి వచ్చారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ముగ్గురు సభ్యులతో కూడిన వైద్యబృందం ఎంపీకి వైద్య పరీక్షలు చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను వీడియో రికార్డు చేయనున్నారు. ఈ వీడియోను సీల్డ్ కవర్‌లో సుప్రీంకు సమర్పించనున్నారు. సుప్రీం నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామకృష్ణరాజు మిలటరీ ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది.
ముసుగు వేసుకొని కొట్టారు..
విచారణ పేరుతో.. ముసుగు వేసుకొని కొందరు దారుణంగా కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. వారిలో సునీల్‌కుమార్ అనే డీజీ కూడా ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. తనను హతమార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.