వినాయక చవితి వస్తుందంటే చాలు... నెలరోజుల ముందు నుంచే గణపతి విగ్రహాల తయారీ ఊపందుకుంటుంది. ఈసారి ఎక్కువగా మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని తయారీదారులు పేర్కొంటున్నారు. గత ఏడాది కంటే ... ఈ సంవత్సరం ఆర్డర్ల సంఖ్య పెరగాయని చెబుతున్నారు. మట్టి, గడ్డితో పాటు సహజ రంగులనే విగ్రహాల తయారీలో వినియోగిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లదంటున్నారు. మట్టి, గడ్డి నేలలో కలిసిపోతాయని అంటున్నారు. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ను వినియోగించి విగ్రహాలు తయారు చేస్తే... వాటిని నీటిలో వేసినప్పుడు వాటి అవశేషాలు అలాగే ఉండిపోతాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆకర్షణీయంగా కొలువు తీరనున్న గణేశులు..
ఈసారి అనేక రకాల వినాయక విగ్రహాలు ఆకర్షణీయంగా కొలువుదీరనున్నాయి. సిక్స్ ప్యాక్ గణపతి, రథంపై వెళ్లే గణపతి, శత్రువులను వేటాడే గణపతి, అభయ గణపతి, కూర్చుని ఉండే గణపతి, నాట్యం చేసే గణపతి ఇలా రకరకాల విగ్రహాలను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారీదారులు తయారుచేసి ఇస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాల తయారీకి యంత్రాలతో కోసిన గడ్డిని వినియోగించరు. కేవలం చేతులతో కోసిన గడ్డిని మాత్రమే వినియోగిస్తారు. ఇలాంటి గడ్డిని ఎక్కువగా భువనేశ్వర్ నుంచి తీసుకొస్తున్నామని తయారీదారులు పేర్కొంటున్నారు. ఈసారి గడ్డి కొరత ఎక్కువగా ఉండడం వల్ల విగ్రహాల తయారీని కొంత తక్కువగానే చేస్తున్నామంటున్నారు. గణపతి, దుర్గమాత విగ్రహాల తయారీ తర్వాత తమకు పెద్దగా పని ఉండదని పని చేసినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాల్సి వస్తుందంటున్నారు. ఆ తర్వాత ఖాళీగానే ఉంటామని పేర్కొంటున్నారు.
పర్యావరణ సంరక్షణలో భాగస్వామ్యం కావాలి
మట్టి గణపతి విగ్రహాలనే వినియోగించాలని పలు స్వచ్చంధ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కూడా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేయనున్నారు. మరోపక్క జీహెచ్ఎంసీ కూడా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలనే యోచనలో ఉంది. ఇలా ఎవరికి వారు పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వామ్యం కావాలని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి: దున్నపోతులపై పందెం కాసి రాక్షసానందం!