నిద్ర లేచీ లేవగానే బ్రష్ నిండా పేస్ట్ పెట్టుకొని పళ్లను చేపను రుద్దినట్లు రుద్దుతుంటారు కొంతమంది. ఇలాగైతేనే దంతాలు తళతళా మెరుస్తాయనుకుంటారు. నిజానికి ఇలా రుద్దడం అస్సలు సరికాదంటున్నారు దంతవైద్య నిపుణులు. దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోవడంతో పాటు ఇతర నోటి సమస్యలూ తప్పనని హెచ్చరిస్తున్నారు..! కేవలం ఇదొక్కటనే కాదు.. నోటి శుభ్రత విషయంలో కొంతమందిలో ఉండే అతి జాగ్రత్త, అపోహలు కూడా ముప్పు తెచ్చిపెడుతుంటాయంటున్నారు!
* ఒక్కసారి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది!
సమయం లేకపోవడం వల్లో లేదంటే బద్ధకించో.. ఇలా కారణమేదైనా రోజులో ఒక్కసారి పళ్లు తోముకుంటే సరిపోతుందనుకునే వారు చాలామందే ఉన్నారు. మరికొంతమందేమో ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు రెండుసార్లు బ్రష్ చేసుకుంటుంటారు. నిజానికి ఇలా రెండుసార్లు బ్రష్ చేసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా చిగుళ్లు ప్రేరేపితమై.. వాటికి సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు. దీంతో పాటు రోజుకోసారి ఫ్లాసింగ్ (దంతాల మధ్య శుభ్రం చేసుకునే ప్రక్రియ) తప్పనిసరి అంటున్నారు. అయితే దీని కారణంగా పళ్ల మధ్యలో గ్యాప్ వస్తుందేమోనని చాలామంది అనుమానం. కానీ అదీ అపోహేనని.. సరైన పద్ధతిలో ఫ్లాసింగ్ చేసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. ఇలా పళ్ల సందుల్లో కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం, చిగుళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇక ఈ ఫ్లాసింగ్ పద్ధతి కోసం ప్రత్యేకంగా ఫ్లాస్ టూత్‌పిక్స్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి.
* మౌత్‌వాష్ కేవలం నోటి దుర్వాసనను దూరం చేయడానికే ఉపయోగపడుతుంది!
ఇది పూర్తిగా అపోహేనంటున్నారు నిపుణులు. బ్రష్ చేసుకున్న తర్వాత మౌత్‌వాష్‌తో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన దూరమవడంతో పాటు.. దంతాల మధ్య ఉండిపోయిన ఆహార పదార్థాల అవశేషాలు, నోటిలో ఉన్న క్రిములు.. వంటి వాటిని తొలగించుకోవచ్చు. ఈ పనంతా ఇందులోని అత్యవసర నూనెలే చేస్తాయి. అలాగని బ్రషింగ్‌కి బదులుగా మౌత్‌వాష్‌తో పుక్కిలించడం కూడా సరైన పద్ధతి కాదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మౌత్‌వాష్‌తో గార్గ్‌లింగ్ కూడా చేయకూదట! అందుకే మౌత్‌వాష్‌ను కొన్నాక ఎలా వాడాలో, ఎంత వాడాలో లేబుల్ చదవడం, లేదంటే నిపుణుల్ని అడిగి తెలుసుకోవడం మంచిది.
* హార్డ్ బ్రష్ ఉపయోగించాలి.. ఎక్కువసేపు తోముకోవాలి!
హార్డ్ బ్రష్‌కి ఉండే గరుకైన బ్రిజిల్స్ వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయే ప్రమాదముంది. అలాగని మరీ మృదువైన బ్రిజిల్స్ ఉండే బ్రష్ ఉపయోగిస్తే పళ్లు అంతగా శుభ్రపడకపోవచ్చు. కాబట్టి ఈ రెండింటి కంటే మీడియం టూత్‌బ్రష్ సరైన ఎంపిక అంటున్నారు. అలాగే దంతాల్ని ఎక్కువ సేపు తోమడం కూడా సరికాదు. దీనివల్ల కూడా పళ్లకు రక్షణ కవచంలా ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుంది కాబట్టి రెండు నిమిషాల పాటు సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవాలంటున్నారు. తద్వారా మనం ఉపయోగించే టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ వల్ల పళ్లు చక్కగా శుభ్రపడతాయి. మీకు మరీ తళతళా మెరిసిపోయే పళ్లు కావాలనుకుంటే ఇలా హార్డ్ టూత్‌బ్రష్, ఎక్కువ సేపు తోమడం.. వంటివి మాని డెంటిస్ట్‌ని సంప్రదించి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. అయితే అది కూడా దుష్ప్రభావాలు లేనిదైతేనే అని గుర్తుపెట్టుకోండి.
* పంటి సమస్యలొస్తేనే డాక్టర్‌ని సంప్రదించాలి!
ఏ వయసు వారైనా నిర్ణీత వ్యవధుల్లో కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి! అయితే చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చూపించుకోవచ్చులే అనుకుంటుంటారు. నోటి ఆరోగ్యం గురించి కూడా చాలామందిలో ఇలాంటి భావనే ఉంటుంది. కానీ ఇది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే నోటికి సంబంధించిన సమస్యల్లో చాలా మటుకు ఎలాంటి లక్షణాలు లేకుండానే బయటపడతాయట! కాబట్టి సమస్య ముదిరాక బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్తపడమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకోసారైనా డెంటిస్ట్‌ని సంప్రదించి వారు సూచించిన పరీక్షలన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే డెంటల్ క్లీనింగ్ (నిపుణుల వద్ద దంతాల్ని శుభ్రం చేయించుకునే పద్ధతి) వల్ల దంతాలు వదులవుతాయనే అపోహ కూడా కొంతమందిలో లేకపోలేదు. కానీ ఇది నిజం కాదని ఇలా ప్రత్యేక పద్ధతుల్లో దంతాల్ని శుభ్రం చేయించుకుంటే వాటిపై పేరుకున్న పాచి తొలగిపోయి.. అవి మరింత శుభ్రపడతాయని, తద్వారా నోటి ఆరోగ్యం కూడా ఇనుమడిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
* పిల్లలకు నాలుగైదేళ్లొచ్చే దాకా బ్రష్ చేయాల్సిన అవసరం లేదు.
మనం మన దంతాల్ని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. పిల్లలకూ వారి పాల దంతాల్ని రోజూ క్లీన్ చేయడం అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. లేదంటే వారు తినే ఘనాహారంలోని పదార్థాల అవశేషాలు, చక్కెరలు.. వారి దంతాలకు హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి రెండేళ్లు దాటిన చిన్నారులకు పిడియాట్రిక్ టూత్‌పేస్ట్‌తో రోజూ పళ్లను శుభ్రం చేయడం మంచిది. ఇక ఏడాది నుంచి రెండేళ్ల మధ్య చిన్నారులకైతే కేవలం నీళ్లతోనే బ్రష్ చేయించమంటున్నారు నిపుణులు. ఇలా చిన్నతనం నుంచి చక్కటి బ్రషింగ్ అలవాట్లను వారికి నేర్పిస్తే.. పెద్దయ్యాక కూడా వారు వాటిని అలాగే కొనసాగిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి నోటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.
నోటి ఆరోగ్యం గురించి మీలోనూ ఇలాంటి అపోహలున్నట్లయితే వెంటనే వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి.. అలాగే నిర్ణీత వ్యవధుల్లో డెంటిస్ట్‌ని సంప్రదించి చెకప్స్ చేయించుకోవడం మాత్రం మరవద్దు!
హ్యావ్ ఎ హ్యాపీ స్మైల్!
ఇదీ చూడండి: ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్... ప్రారంభించిన హరీశ్ రావు