ఏపీలో తిరుపతి స్విమ్స్‌లోని శ్రీ పద్మావతి కొవిడ్ ఆసుపత్రి.. స్టేట్ కొవిడ్ వైద్యశాలగా కరోనా రోగులకు సేవలందిస్తోంది. ఇక్కడ మొత్తం 145 ఐసీయూ, 328 ఆక్సిజన్ పడకలున్నాయి. వీటిలో 40 వెంటిలేటర్లు సైతం ఉన్నాయి. ఇక్కడి కొవిడ్ రోగుల అవసరాల నిమిత్తం 22 వేల లీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ ఉంచేలా.. 11 కిలోలీటర్ల సామర్థ్యంతో రెండు స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు.
కరోనా ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా 11 కెఎల్ ఆక్సిజన్ ట్యాంక్ కేటాయించగా.. ప్రత్యామ్నాయంగా 220 మ్యానిఫోల్డ్ బల్క్ సిలిండర్లను అందుబాటులో ఉంచారు. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్‌వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్‌కు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. రెండు ట్రిప్పుల్లో సుమారు 14వేల లీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుతోంది. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు.. గుత్తేదారు కంపెనీని ఇరకాటంలో పడేశాయి. సొంత రాష్ట్రంలో రోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. పొరుగు రాష్ట్రాలకు పంపే ఆక్సిజన్ సరఫరాలో కోత విధించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా ఇప్పటివరకూ 14 వేల లీటర్ల ఎల్ఎంవోను సరఫరా చేసిన సదరు సంస్థ.. ఇకపై కేవలం 8వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ మాత్రమే పంపిస్తామని స్విమ్స్‌కు లేఖ రాయడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఆక్సిజన్ సరఫరా తగ్గిస్తామన్న తమిళనాడు కంపెనీ లేఖ సమాచారాన్ని.. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్, స్టేట్ కొవిడ్ కంట్రోల్ ఛైర్మన్ జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తెలిపారు. వారు తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఆక్సిజన్ కొరతతో రుయాలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కళ్ల ముందే మెదులుతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా సమస్యను పరిష్కరించాలని వైద్యులు కోరుతున్నారు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రాణవాయువు కొరత లేకుండా చూడాలంటున్నారు.
- ఇదీ చదవండి : ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులకు అనుమతి