వైశాఖ పౌర్ణమి రోజు సిద్దార్థుడు జన్మించడం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని; ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తోంది. అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించడం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి.
ఈరోజు ఏం చేస్తారు?
వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువు ఆరాధించి పూజించడంతో పాటు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషం. ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి, ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదువుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం. అలాగే, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, గౌరీదేవిని పూజించడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, అన్నమాచార్యుల వారిని, బుద్ధుడిని, కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువును పూజించండం విశేషం.
ఏం దానం చేయాలి?
వైశాఖ పౌర్ణమి రోజు చేసే దానధర్మాలకు అనేక శుభ ఫలితాలు ఉన్నాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పేదవారికి వస్త్రదానం, గొడుగు, చెప్పులు, నీటికుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. అలాగే, గయలో స్నానమాచరించినా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకొని పూజించడం వల్ల గొప్ప పుణ్యం కలుగుతుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.