గుజరాత్ ముంద్రా పోర్టులో పెద్దఎత్తున పట్టుబడిన హెరాయిన్ వ్యవహారంపై విజయవాడ పోలీసులు ఆరా(Vijayawada police investigating on heroin case) తీస్తున్నారు. విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ సంస్థ పేరుతో అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన రెండు కంటెయినర్లలో హెరాయిన్ పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు.. సంస్థ వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలపై కూపీ లాగుతున్నారు. కాకినాడ, విజయవాడ, చెన్నైలో సంస్థ మూలాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు ఈ అక్రమ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.
ఆదివారం వెలుగులోకి..
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.9,000 కోట్ల విలువైన హెరాయిన్(Heroin worth Rs 9000 crore seized) ఉన్న 2 కంటెయినర్లను ఈ నెల 15న జప్తు చేసిన సంగతి ఆదివారం వెలుగులోకి వచ్చింది. అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేసే హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ ముసుగులో వచ్చిన ఈ సరకు విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు.. సంస్థ వ్యాపార లావాదేవీలు, ఇప్పటివరకు ఎన్ని కన్‌సైన్‌మెంట్లు వచ్చాయి? ఏయే దేశాల నుంచి వచ్చాయి? తదితర వివరాలను కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ ఈటీవీ భారత్- ఈనాడు’ ప్రతినిధి ఆషీ ట్రేడింగ్ కంపెనీ పూర్వాపరాలు పరిశీలించగా.. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకూ దీని మూలాలు విస్తరించినట్లు తేలింది. కేవలం దస్త్రాలు, కాగితాల్లో మాత్రమే ఈ కంపెనీని నడిపిస్తున్నట్లు వెల్లడైంది.
గతేడాది ఆగస్టులో నమోదు..
విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వారి వీధి చిరునామాతో ఆషీ ట్రేడింగ్ కంపెనీ గతేడాది ఆగస్టు 18న నమోదు (రిజిస్టర్) అయింది. దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు అనే వ్యక్తి పేరిట ఈ కంపెనీని స్థాపించారు. బియ్యం, పండ్లు, కూరగాయల టోకు వ్యాపారం చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన ఫోన్ నంబర్ మాత్రం ఎం.సుధాకర్ అనే వ్యక్తి పేరున ఉంది. ప్రస్తుతం ఆ ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. అదే నంబర్‌తో ఉన్న వాట్సప్ ప్రొఫైల్ చిత్రాన్ని పరిశీలించగా.. చెన్నై కేంద్రంగా ‘ఆషీ సోలార్ సిస్టమ్’ అనే మరో కంపెనీని కూడా సుధాకర్ నెలకొల్పినట్లు తేలింది. దానికి సంబంధించిన బ్రోచర్‌ను తన ఫోన్ నంబర్, పేరుతో సహా ఆయన వాట్సప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: White challenge issue: న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా: కేటీఆర్