Uppal Bhagayath Plots e- Auction: ఉప్పల్ భగాయత్ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01లక్షల చొప్పున ధర పలకడం గమనార్హం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్ వేదికగా జరిగిన ఈ ప్రక్రియలో ఉప్పల్ ప్రాంతానికి భవిష్యత్తు ఉందనే నమ్మకంతో ప్రవాసీయులతోపాటు స్థానిక రియల్టర్లు నువ్వా నేనా అన్నట్టుగా ధరలు పెంచుకుంటూ పోయారు. చదరపు గజానికి రూ.35వేలు నిర్ధారిత ధర ఉండగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాటుకు అత్యధికంగా చదరపు గజానికి రూ.77వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా రూ.1.01లక్షల రికార్డు ధరలు పలికాయి. కేవలం 19వేల చదరపు గజాలకే రూ.141.61 కోట్లు తొలి రోజు రాగా, శుక్రవారం మిగిలిన 1.15లక్షల చదరపు గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున రూ.60వేలు వరకు వచ్చినా సుమారు రూ.900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారీ అంచనాలు..
మల్టీ పర్పస్ జోన్‌కి కేటాయించిన 12.04 ఎకరాల్లో 10 ప్లాట్లతో పాటు మరో 11 ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నారు. తొలిరోజు ప్రవాసీయులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడంతో రెండో రోజు మల్టీపర్పస్ భూములకు చదరపు గజానికి కనీసం రూ.70వేల దాకా పలికే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఉప్పల్ భూ విక్రయాల్లో రికార్డు సృష్టించనుందని చెబుతున్నారు.
ఇదీచూడండి: Uppal Bhagayath plots E-Auction 2021 : ఉప్పల్ భగాయత్ ప్లాట్ల విక్రయానికి మరోసారి ప్రీబిడ్