Kishanreddy fires on CM Kcr: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేస్తున్నారు తప్ప.. తెలంగాణలో ఉండే ప్రతిపక్షాలను కేసీఆర్ కలవరని ఆరోపించారు.
కేసీఆర్ వ్యవహారమంతా ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంటుందని.. అలాంటి వ్యక్తి దేశాన్ని ఉద్దరిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. వివిధ శాఖలకు చెందిన చెల్లింపులు సకాలంలో జరపడం లేదని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించట్లేదని అన్నారు. రాష్ట్రంలో చిన్న చెల్లింపులు కూడా సకాలంలో జరపకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
'దేశంలో అబద్దమాడే కుటుంబం ఏదైనా ఉందంటే కల్వకుంట్ల కుటుంబం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. కేసీఆర్ వైఫల్యాలను తప్పించుకునేందుకు కేంద్రాన్ని నిందిస్తున్నారు. పంచాయతీ నిధులను సకాలంలో విడుదల చేయకుండా సర్పంచ్‌లను బెదిరిస్తున్నారు. రైతుల రుణమాఫీని ఇప్పటికీ పూర్తి చేయలేదు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలప్పుడు దళిత బంధు అని మభ్యపెట్టారు. మునుగోడులో ఉపఎన్నిక వస్తే గిరిజన బంధు అంటున్నారు.' -కిషన్‌రెడ్డి, కేంద్రపర్యాటక శాఖ మంత్రి
ధరణితో ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ధరణిలో అన్యాయం జరిగిందని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. తెరాస నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తెరాస నేతలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన వైఫల్యాలను కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వసతిగృహాల్లో కనీస వసతులు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు రూ.3016 ఇస్తానని చెప్పి మూడేళ్లు అయిపోయినా.. ఇంకా ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: