కొవిడ్-19 నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో "ఆత్మ నిర్భర్ భారత్" ప్రతిబింబించేలా రంగాల వారీగా కేటాయింపులు చేశారు. 2021-22 బడ్జెట్ అంచనా మొత్తం 34.83 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.
మిశ్రమ స్పందన..
లాక్‌డౌన్ సమయంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేటాయించగా.. ఇందులో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి కింద లక్ష కోట్ల రూపాయలు కేటాయించినా.. ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిన నిధుల కేటాయింపులపై.. వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
వ్యవసాయ, ఆర్థిక, పౌల్ట్రీ రంగాల్లో..
ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 9.5 శాతం. 2021-22లో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితం చేయాలనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ద్రవ్య లోటును ప్రభుత్వ అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవాలని నిర్ణయించింది. రైతుల ఆదాయం పెంచే ఆలోచనతో బడ్జెట్‌ను రూపొందించినట్లు కేంద్రం ఉద్ఘాటించింది. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వ్యవసాయం లక్ష్యాలుగా కేంద్ర బడ్జెట్‌లో రంగాల వారీగా కేటాయింపులు చాలా బాగున్నాయని.. వ్యవసాయ, ఆర్థిక, పౌల్ట్రీ రంగ నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు.
చిన్న పరిశ్రమల నిర్వచనం మార్పు..
చిన్న పరిశ్రమల నిర్వచనంలో కేంద్రం మార్పు చేసింది. 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల పెట్టుబడి పరిమితి వరకు చిన్న సంస్థలుగా గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించిన మోదీ సర్కారు... వ్యవసాయ రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్ల రూపాయలుగా నిర్దేశించింది. మొత్తంగా ఇది దేశానికి మంచి చేసే బడ్జెట్‌గా వ్యవసాయ, ఆర్థిక, వ్యక్తిగత నిపుణులు అభివర్ణించారు.
పెదవి విరుపులు..
ప్రపంచంలో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్న తరుణంలో... కొవిడ్ తర్వాత వచ్చిన తొలి కేంద్ర బడ్జెట్ కాబట్టి.. చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి యత్నించినప్పటికీ.. వ్యవసాయ రంగానికి ఆశించినంత మేర కేటాయింపులు జరగలేదన్న పెదవి విరుపులు ఉన్నాయి.
ఇవీచూడండి: కేంద్రం కొత్త సెస్- ధరలు మాత్రం పెరగవ్!