జేఎల్‌ఎం రాత పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చిందనే మిస్టరీ వీడింది. విద్యుత్తు అధికారులకు పోలీసులు సమర్పించిన విచారణ నివేదికలో కీలక వివరాలు బయటపెట్టారు. ఏడీఈనే నకిలీ సర్టిఫికెట్లతో పరీక్షకు హాజరైనట్లు గుర్తించారు.
పక్కా ప్లాన్ ప్రకారం... పరీక్షల అక్రమాల్లో ఏడీఈ ఫిరోజ్‌ఖాన్ సూత్రధారే కాదు పాత్రధారి కూడా. పరీక్ష హాల్లోకి అభ్యర్థులకు సమాధానాలు చేరవేసేందుకు ఆయనే ఏకంగా ఒక కేంద్రంలో పరీక్ష రాసినట్లు పోలీసుల విచారణలో బయటకొచ్చింది. వేరే పేరుతో నకిలీ సర్టిఫికేట్లతో పరీక్షకు హాజరయ్యారు. గుర్తింపు కోసం నకిలీ ఆధార్ కార్డును సైతం సృష్టించారు. హాల్‌టికెట్‌పై ఉన్న పేరు, ఫొటో, ఆధార్ కార్డుపై ఉన్న ఫొటో, పేరు సరిపోలడంతో ఎవరికి అనుమానం రాలేదు. హాల్లోకి వెళ్లేటప్పుడే కొత్త మొబైల్‌ను లోదుస్తుల్లో తీసుకెళ్లాడు. ప్రశ్నాపత్రం చదివి వాటికి సమాధానాలను రాసుకున్నాక మరుగుదొడ్డిలోకి వెళ్లి బయట ఉన్న తన ముఠాకు చేరవేశారు.
త్వరలో కొత్త డేట్... అక్కడి నుంచి వారు వేర్వేరు పరీక్ష కేంద్రాల్లోని అభ్యర్థుల మొబైల్‌కు పంపారు. అందరూ కూడా కొత్త మొబైల్‌ను లోదుస్తుల్లో తీసుకుని పరీక్షకు హాజరవ్వాలని ముందే పథకం వేసుకున్నారు. ఈ ముఠా నుంచి 181 మందికి సమాధానాలు చేరినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇంకా ఎక్కువ మందికే సమాధానాలు అందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. త్వరలో కొత్త నోటిపికేషన్ వేస్తామని ప్రకటించారు.
విద్యార్థుల ఫిర్యాదుతో... టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. జులై 17న హైదరాబాద్‌లోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించారు. 50వేల పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఘట్‌కేసర్ పరీక్ష కేంద్రంలో ఒక అభ్యర్థి సెల్‌ఫోన్‌తో పట్టుబడటంతో పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తనకు మొబైల్‌లో సమాధానాలు చేరవేస్తామని లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుని సమాధానాలు పంపకుండా మోసం చేశారని లోక్యానాయక్ అనే అభ్యర్థి మలక్‌పేట లైన్స్ ఏడీఈ ఫిరోజ్‌ఖాన్‌పై అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జేఎల్‌ఎం నోటిఫికేషన్ రద్దు.. కొందరు ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇటు హైదరాబాద్, అటు రాచకొండ పోలీసులు విచారణ చేపట్టగా డొంకంతా కదలింది. ఇద్దరు ఏడీఈలతో సహా ముగ్గురు విద్యుత్తు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పరీక్ష కేంద్రంలో 181 మంది అభ్యర్థులకు మొబైల్ ద్వారా సమాధానాలు చేరవేసినట్లు విచారణలో గుర్తించారు. ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు అని పోలీసులు డిస్కంకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. పరీక్షల్లో అక్రమాల దృష్ట్యా నోటిఫికేషన్ రద్దుచేయాలని కొంతమంది అభ్యర్థులు డిస్కం కార్పొరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో పాటూ యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించారు. వీటన్నింటిని డిస్కం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సర్కారు ఆదేశాల మేరకు జేఎల్‌ఎం నోటిఫికేషన్‌ను రద్దుకు డిస్కం నిర్ణయం తీసుకుంది.
ఇవీ చదవండి: