హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం అభ్యర్థి ఖరారుపై తెరాస ఆచితూచి వ్యవహరిస్తోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి బీఫారం అందించగా..... విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్థి విషయంలో మాత్రం గులాబీ పార్టీ మల్లాగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఓటరు జాబితా సవరణ సమయంలో పార్టీ నేతలంతా చురుగ్గా పాల్గొన్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ఆ సమయంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత తెరాస తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్‌తో పాటు టీఎన్జీఓ మాజీ నేత దేవీప్రసాద్.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా తెరాస నేత నాగేందర్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎన్నారై పేర్లు వినిపిస్తున్నాయి.
ఆచితూచి అడుగులు...
పోటీలో ఉన్న ప్రత్యర్థులు రామచంద్రరావు, నాగేశ్వర్ ఇప్పటికే ప్రచారం చేస్తుండగా... మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. తెరాసలో మాత్రం పట్టభద్రుల ఎన్నికల దిశగా ప్రచారం కనిపించడం లేదు. గులాబీపార్టీ అసలు పోటీలో ఉంటుందా లేదా అనే ప్రచారం... రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్ర ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్న తెరాస..ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడూ అదే వ్యూహం అనుసరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఫలితాలు, పీఆర్సీపై ఉద్యోగుల్లో అసంతృప్తి, ఉద్యోగ ప్రకటనలు వెలువడక పోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో... పోటీ, అభ్యర్థిత్వంపై వ్యూహాత్మకంగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రావిర్భావం జరిగిన కొన్నాళ్లకే జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంలో తెరాస ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విశ్లేషించి... సోమవారం నాటికి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.