పురపాలక ఎన్నికల వ్యూహరచన కోసం.. ఇవాళ తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులను ఆహ్వానించారు.
ఎన్నికల ఇన్‌ఛార్జీలను ప్రకటించే అవకాశం
వచ్చే నెలలో పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సన్నాహకంగా ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర కమిటీ సమావేశాలను కేటీఆర్ నిర్వహించారు. తాజాగా 120 పురపాలక సంఘాలు, 10 నగరపాలక సంస్థలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైనందున పార్టీని సమాయత్తం చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఇన్‌ఛార్జులను ప్రకటించే వీలుంది.
ఈవారంలో తెరాస శాసనసభాపక్ష సమావేశం
పురపాలక ఎన్నికలను తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కీలకమైన ఎన్నికల వ్యూహంపై చర్చించడంతో పాటు విజయ సాధనకు అవసరమైన కార్యాచరణను కేటీఆర్ ఈ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ వారంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెరాస శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే వీలుంది.
ఇవీ చూడండి: రేపు తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం