రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే అవన్నీ చాలావరకు కీలకమైనవే కావడంతో భూయజమానులు కొంత కంగారుపడుతున్నారు. భూ సేవలకు ప్రారంభించిన ధరణి పోర్టల్ కొన్ని సేవలకే పరిమితమవుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు పోగుబడుతున్నాయి. వీటిలో రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూశాఖల అధికార పరిధికి సంబంధించినవి కొన్ని ఉండగా, ధరణిలో ఐచ్ఛికాలు లేక భూ యజమానులకు ఎదురవుతున్న ఇబ్బందులు మరికొన్ని ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నుంచి తమకు మార్గదర్శకాలేవీ రాలేదని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
వారికి కష్టమేనా?
పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పిల్లల పేరిట భూమిని గిఫ్ట్ డీడ్ చేయడానికి వీలుండేది. పిల్లల సంరక్షకుడి పేరును జతచేస్తూ రిజిస్ట్రేషన్ చేసి హక్కు పత్రాలు జారీ చేసేవారు. ధరణిలో వ్యవసాయ భూములకు ఒకరి పేరుతోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి వీలుంది. పైగా మైనర్లను సాఫ్ట్‌వేర్ అనుమతించడం లేదు. దీంతో తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్ల పేరుతో భూమిని రిజిస్టర్ చేద్దామనుకుంటున్నవారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మార్కెట్ విలువ నిర్ధారణ ఎలా?
పాత రిజిస్ట్రేషన్ విధానంలో సబ్ రిజిస్ట్రార్ ఒక భూమి విలువను ధ్రువీకరిస్తూ పత్రం జారీ చేసేవారు. కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ ఆ పత్రం అక్కరకొచ్చేది. ధరణిలో మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం జారీ చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయ భూమి మార్కెట్ విలువను అధికారికంగా తెలుసుకోవడం కష్టంగా మారిందని రైతులు చెబుతున్నారు.
దూరప్రాంతాల్లో ఉన్నవారికి నిరాశ
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు హాజరుకాలేని భూ యజమానులు తమ తరఫున కుటుంబ సభ్యులను పంపించేందుకు అధీకృత ధ్రువపత్రం జారీచేసే అవకాశం ఉండేది. ఈ మేరకు 32ఎ ఆథరైజేషన్ పత్రాన్ని భూ యజమాని ఇచ్చేవారు. దాని ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ భూ యజమాని సూచించిన వారితో లావాదేవీలు పూర్తి చేసేవారు. తాజాగా ధరణి పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్న విధానంలో భూ యజమాని తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సి వస్తోంది. విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు, అనారోగ్యంతో ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో భూమిని విక్రయానికి పెట్టాలంటే ప్రస్తుత నిబంధన కష్టంగా మారిందని చెబుతున్నారు.
అపరిష్కృత మ్యుటేషన్ల మాటేమిటి?
ధరణి ప్రారంభానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లకు మ్యుటేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఆ ప్రక్రియకు ముందడుగు పడటం లేదు. మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాక ఆ వివరాలు తహసీల్దార్ల కంప్యూటర్లకు చేరడం లేదని బాధితులు వాపోతున్నారు. దీనిపై అయోమయం నెలకొంది.
మార్ట్‌గేజ్ దరఖాస్తుకు అవకాశం
భూములు తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందడానికి వీలుగా ధరణి పోర్టల్లో ‘మార్ట్‌గేజ్’ దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇన్నాళ్లూ సబ్ రిజిస్ట్రార్లు మార్ట్‌గేజ్ చేసేవారు. తాజాగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, బహుమతి, వారసత్వ బదిలీ, భాగపంపిణీ తదితర సేవలను తహసీల్దార్ల పరిధిలోకి చేర్చడంతో భూముల తనఖా అధికారం కూడా వారికి సమకూర్చారు. మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ధరణి పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. గతంలో మార్ట్‌గేజ్ చేసి రుణాలు పొందిన వారు తిరిగి వాటిని చెల్లించి భూములను వెనక్కు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో అవి నిలిచిపోయాయి. తాజాగా ధరణిలో ఇచ్చిన అవకాశంతో పాతవాటి రద్దు అధికారం కూడా తహసీల్దార్లకే ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో మార్ట్‌గేజ్‌తో రుణాలు పొందిన వారు పెద్ద సంఖ్యలో ఉండగా, వాటి రద్దుకోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు.