Isha Foundation News: మట్టి మన ఆస్తి కాదు... వారసత్వం అనే నినాదంతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన మట్టి పరిరక్షణ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతుంది. ఆయన మహాసంకల్పానికి మద్దతుగా హైదరాబాద్‌లో ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు శిల్పరామం రాక్‌హైట్స్‌లో 'మట్టి కోసం మనం' పేరుతో ప్రత్యేక సంగీత విభావరి నిర్వహించారు. ఈ వేడుకకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోశ్‌కుమార్, రైతునేస్తం వ్యవస్థాపకులు పద్మశ్రీ వెంకటేశ్వర్‌రావు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
మట్టిని రక్షించే ఉద్యమానికి సంఘీభావాన్ని తెలిపారు. సద్గురు చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావడం... ఎంతో ఆనందంగా ఉందన్న జోగినపల్లి సంతోశ్... మట్టికి విలువ ఇస్తేనే మనిషికి విలువ పెరుగుతుందన్నారు. భూమాతను రక్షించేందుకు ప్రతిచేయి తోడవ్వాలని ఆకాంక్షించారు. మట్టిని రక్షించే ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులవుతున్నారు. పదేళ్ల సుహాస్ నాగార్జున సాగర్ వరకు స్కేటింగ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించగా... కామారెడ్డికి చెందిన వెన్నెల సైక్లింగ్ చేస్తూ పుడమి తల్లిని కాపాడాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
ధరణిమాత క్షేమాన్ని కాంక్షిస్తూ గాయనీ గాయకులు మంగ్లీ, శ్రీలలిత, సాహితీ చాగంటి, సాందీప్, రామ్ మిర్యాల ఆలపించిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. మంగ్లీ పాడిన ధరణి, రామ్ ఆలపించిన నేలమ్మ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇషా ఫౌండేషన్ వాలంటీర్లతో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ ఆడిపాడి ఉత్సాహపరిచారు.
ఇవీ చదవండి:రాష్ట్రంలో 7.7 శాతం పెరిగిన పచ్చదనం.. హరితహారంతోనే సుసాధ్యం..