తెలంగాణ శాసనసభ, మండలిలో చీఫ్‌విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. మంత్రిమండలిలో ఆరుగురికే అవకాశం ఉన్నప్పటికీ... ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో మంత్రివర్గ విస్తరణకు ముందే కీలక పదవులను ప్రకటించారు. కేబినెట్ హోదా కలిగిన చీఫ్ విప్, విప్ పదవుల్లో 12 మందిని నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కనీసం ఒకరు కేబినెట్ హోదాతో పాటు సామాజిక వర్గాల సమతూకాన్ని పాటించారు. ఐదుగురు ఓసీలు, నలుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి విప్ పదవులు వరించాయి.
గతంలో ముగ్గురు... ప్రస్తుతం ఆరుగురు
గత శాసనసభలో చీఫ్ విప్, ముగ్గురు విప్‌లు ఉండగా... ఇప్పుడు ఆరుగురు విప్‌లను నియమించారు. గత అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మంత్రి కావడం వల్ల...ఆ పదవిని వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన దాస్యం వినయ్ భాస్కర్‌ను వరించింది. కేబినెట్‌లో మున్నూరు కాపులకు స్థానం కల్పించకపోవడం వల్ల.. ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో దాస్యం వినయ్ భాస్కర్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడం, కేటీఆర్‌తో సాన్నిహిత్యం దాస్యంకు కలిసొచ్చాయి.
పాత వారికి... మళ్లీ అవే పదవులు
గతంలో విప్‌లుగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పెరిక సామాజిక వర్గానికి చెందిన కామారెడ్డి జిల్లా నేత గంప గోవర్ధన్ మంత్రివర్గంలో స్థానం ఆశించినప్పటికీ... మళ్లీ అవే పదవుల్లో కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి అరికెపూడి గాంధీకి విప్‌గా స్థానం కల్పించారు. కేబినెట్‌లో రంగారెడ్డి జిల్లాకు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత లేకపోవడం.. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజవకవర్గాలను ప్రభావితం చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎస్సీలకు కీలక పదవులు
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌కు విప్‌లుగా అవకాశం కల్పించారు. వీరిద్దరికి పదవులతో నాగర్‌కర్నూలు, మంచిర్యాల జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరడం సహా.. పలువురు గిరిజన ఎమ్మెల్యేలను పార్టీలో చేరేలా చొరవ చూపిన రేగా కాంతారావుకు విప్ పదవి దక్కింది. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఓటమి పొందడం వల్ల ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పటి వరకు విప్‌గా ఉన్న జనగామ జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లు పదోన్నతి కల్పిస్తూ చీఫ్ విప్‌గా నియమించారు.
తెరాస శ్రేణులు హర్షం....
పెద్దపల్లి జిల్లా నుంచి వెలమ సామాజిక వర్గం నేత భానుప్రసాద్, నల్గొండ జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఎస్సీ నేత ఎంఎస్ ప్రభాకర్, నాగర్ కర్నూలు జిల్లా కు చెందిన దామోదర్ రెడ్డికి విప్ పదవులు దక్కాయి. ఉమ్మడి వరంగల్ నుంచే అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్, మండలిలో చీఫ్‌విప్‌గా వెంకటేశ్వర్లుకు పదవులు దక్కడంపై తెరాస శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.