Land Passbook Issue : సంగారెడ్డి జిల్లా గోవిందరాజ్‌పల్లి గ్రామ రైతు కొత్త పాసు పుస్తకం కోసం హత్నూరా మండల తహసీల్దారు కార్యాలయం ద్వారా ఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో ఏడాది క్రితం వేలిముద్ర వేశారు. ఇంతవరకూ కొత్తది మంజూరు కాలేదు. ఇదేమని అధికారిని ప్రశ్నించగా ‘ఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌ను ప్రభుత్వం మూసేసిందని, తానేం చేయలేనని’ తహసీల్దారు సమాధానమిస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తంచేశారు. రైతుబంధు కోసం వ్యవసాయాధికారిని అడిగితే పాసుపుస్తకం రాకుండా పేరు నమోదు చేయడం కుదరదంటున్నారని వాపోయారు. తనలాంటి రైతులు మండలంలో వెయ్యిమంది ఉన్నట్టు ఆయన చెప్పారు.
Land Passbook Issue in Telangana : సమస్య ఆ రైతు ఒక్కరిదే కాదు ఇలా దరఖాస్తు చేసుకుని కొత్త పాసుపుస్తకాలు రాని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఉన్నారు. ఈ సంఖ్యను అధికారులూ ధ్రువీకరిస్తున్నారు. ఉదాహరణకు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోనే వెయ్యిమందికిపైగా రైతులు పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరంతా గత రెండేళ్లుగా రైతుబంధు సొమ్ము అందక వేలాది రూపాయలు నష్టపోయారు. ఈ యాసంగిలోనైనా రైతుబంధు సొమ్ము అందుతుందో? లేదోనని ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.
సమస్య ఎక్కడంటే
Telangana Farmers Problems : పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేయకమునుపు ‘భూమి రికార్డుల నిర్వహణ వ్యవస్థ’(ఎల్‌ఆర్‌ఎంఎస్) పోర్టల్ ఉండేది. రైతు పేరుతో ఉన్న పాసు పుస్తకాన్ని రద్దుచేసి, కొత్తది జారీ అయ్యేందుకు వీలుగా ఈ పోర్టల్‌లో రైతు, తహసీల్దార్ ఆన్‌లైన్‌లో వేలిముద్రలు వేసేవారు. దాన్ని ఆ జిల్లా కలెక్టర్ ఆమోదిస్తే కొత్తది జారీ అయ్యేది. ఏడాది క్రితం వరకూ ఇలా వేలిముద్రలు వేసినా, పాసుపుస్తకాలు అందని రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరు నిత్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌ను గత సెప్టెంబరులో ప్రభుత్వం నిలిపివేసిందని తామేం చేయలేమని అధికారులు రైతులను సమాధానపరుస్తూ వస్తున్నారు. పాసు పుస్తకం వస్తుందా? రాదా? అనే సమాచారం తెలుసుకోవాలన్నా ఈ పోర్టల్‌లో చూడాల్సిందేనని’ వివరిస్తున్నారు.
స్పష్టత ఇచ్చే వారేరి?
Rythu Bandhu Scheme in Telangana : ఇటీవల కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దానికి ముందు పాసుపుస్తకాల కోసం వేలిముద్రలు వేసిన వారి పరిస్థితి ఏమిటి? వాటినే పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? అనే సందేహాలు తీర్చేవారూ కరవయ్యారని బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా..గత నెల నుంచి కొత్త యాసంగి సీజన్ ప్రారంభమైనందున, మళ్లీ రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో వేయడానికి అనుగుణంగా వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పుడూ పాత జాబితాలోని రైతులకే రైతుబంధు ఇస్తారా? లేక ఇప్పటివరకూ నమోదైన అదనపు పేర్లనూ పరిగణనలోకి తీసుకుంటారా? అనే విషయమై స్పష్టత లేదు. 'ప్రభుత్వం రైతుబంధు సొమ్ము పంపిణీకి ఇంకా అనుమతి ఇవ్వలేదని, అనుమతి ఇచ్చిన వెంటనే తమవద్ద ఉన్న రైతుల పేర్లకు సొమ్ము జమచేస్తామని’ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు.