నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్ సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న ఎత్తిపోతలు.. ఇలా అన్నీ కలిపి సుమారు 37లక్షల ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో సాగునీరిచ్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదికాక చెరువుల కింద 16లక్షల ఎకరాలకు అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఛైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీ భేటీ శనివారం జరిగింది. ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు నాగేందర్‌రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ప్రాజెక్టులవారీ నీటినిల్వలు, ఖరీఫ్, తాగునీటి అవసరాలకు పోను ఎన్ని టీఎంసీలు అందుబాటులో ఉంటాయి, ఏయే పంటలు వేయవచ్చు, వరి సహా, ఆరుతడి పంటలకు ఎన్ని తడులు ఇవ్వొచ్చు.. తదితర అంశాలన్నీ చర్చించారు. ప్రాజెక్టుల వారీ చీఫ్ ఇంజినీర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా సుమారు 37లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు అవకాశం ఉందని తేల్చినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
ఇందులో భారీ ప్రాజెక్టుల కింద 32లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో 3లక్షల ఎకరాలు, చిన్న ఎత్తిపోతల కింద 1.25లక్షల ఎకరాలు ప్రతిపాదించినట్లు తెలిసింది. గత ఏడాది రబీలో 33.4లక్షల ఎకరాలు సాగైంది. ఇందులో చిన్న నీటివనరుల కింది ఆయకట్టు కూడా కలిసి ఉంది. గతేడాది సింగూరు, నిజాంసాగర్ సహా కొన్ని ప్రాజెక్టుల కింద సాగు జరగలేదు. చెరువుల కిందా పూర్తిస్థాయిలో సాగు కాలేదు. ఈ ఏడాది భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు కలిపే సుమారు 37లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుల కింద సాగయ్యేది దీనికి అదనం. ఇది కూడా కలిపితే ఈ యాసంగిలో సుమారు 53లక్షల ఎకరాల వరకు సాగులోకి వస్తుందని అంచనా.
శ్రీరామసాగర్, నాగార్జునసాగర్ కింద పూర్తిసాగు
శ్రీరామసాగర్ కింద 9.6లక్షల ఎకరాలకు, కడెం కింద 50వేల ఎకరాలకు నీరివ్వడానికి ఇంజినీర్లు ప్రతిపాదించారు. దీంతో వానాకాలం, యాసంగి రెండింటిలోనూ ఈ నీటి సంవత్సరంలో పూర్తి ఆయకట్టు సాగులోకి వచ్చినట్లవుతుంది. నాగార్జునసాగర్ కింద ఆరులక్షల ఎకరాలతో పాటు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్.పి) పరిధిలో 2.65లక్షల ఎకరాలు, మూసీ కింద 28వేలు, డిండి కింద 12వేల ఎకరాలకు నీరివ్వడానికి ప్రతిపాదించారు.
* ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల కింద 3.97లక్షల ఎకరాలకు నీరివ్వాలని ప్రతిపాదించారు. ఇందులో అత్యధికంగా కల్వకుర్తి ఎత్తిపోతల కింద 2.8లక్షల ఎకరాలు, జూరాల 32వేలు, నెట్టెంపాడు 30వేలు, భీమా 23వేలు, రాజోలిబండ 20వేలు, కోయిల్‌సాగర్ కింద 12వేల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు.
* కరీంనగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 51వేల ఎకరాలు, వరద కాలువ పరిధిలో మధ్యమానేరు కింద 40వేల ఎకరాలకు, అప్పర్‌మానేరు కింద 13వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు.
* కాళేశ్వరం ఎత్తిపోతల కింద యాసంగిలో 70వేల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఇందులో అనంతగిరి, రంగనాయక్‌సాగర్ కింద 35వేల ఎకరాలు, కొండపోచమ్మసాగర్ కింద 35వేల ఎకరాలు ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు.
* సింగూరు ప్రాజెక్టు కింద 40వేల ఎకరాలకు నీరివ్వనున్నారు. నిజాంసాగర్ కింద పదివేల ఎకరాల వరిసాగుకు, 70వేల ఎకరాల ఆరుతడి పంటలకు నీరందించాలని ప్రతిపాదించారు. అలీసాగర్ కింద 45వేలు, గుత్ప ఎత్తిపోతల కింద 20వేల ఎకరాల ఆయకట్టుకు ప్రతిపాదన ఇచ్చారు.
* దేవాదుల ఎత్తిపోతల కింద 2.05లక్షల ఎకరాలకు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 38వేల ఎకరాలకు ప్రతిపాదించారు.
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 40వేల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు ప్రతిపాదన చేశారు.
* ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న ఎత్తిపోతల కింద కూడా ఆయకట్టును ప్రతిపాదించారు. చీఫ్ ఇంజినీర్ల ప్రతిపాదనలను పరిశీలించి తుది నిర్ణయం కోసం ప్రభుత్వానికి పంపుతామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. చీఫ్ ఇంజినీర్లు నరసింహ, శంకర్, శ్రీనివాసరెడ్డి, మధుసూదనరావు, అంజయ్య, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.