తెలంగాణ రాష్ట్ర సమితి రానున్న పురపాలక, నగరపాలక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సమాయత్తం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల వారీగా సభలు, సమావేశాలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావుల ఆదేశాలకు అనుగుణంగా మంత్రులు, శాసనసభ్యులు వ్యూహరచన చేపట్టారు. జనవరిలో పురపాలక ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. వార్డుల పునర్విభజన పూర్తి కాగా రిజర్వేషన్లను ఖరారు చేసి, ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో చివరి ఎన్నికలు గత మే నెలలో జరిగాయి. మళ్లీ ఎన్నికల కోసం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపడం, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల పరిధిలోని నేతలను ఏకం చేయడం, పార్టీ పరిస్థితి గురించి ఆరా తీయడం, మంత్రులు, ఎమ్మెల్యేల సామర్థ్యాన్ని అంచనా వేయడం లక్ష్యాలుగా ఎంచుకుంది. ఎన్నికల షెడ్యూలు కంటే ముందే పురపాలక సంఘాలలో సభలు, సమావేశాలు జరపాలని పార్టీ అధిష్ఠానం మంత్రులు, శాసనసభ్యులకు సూచించింది. రాజధాని చుట్టుపక్కల గల నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు సంబంధించిన మంత్రులు, నేతలతో త్వరలో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.
అధినేత ఆదేశం.. అమాత్యుల ఆచరణ
ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో కేసీఆర్ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులే తమ జిల్లాల పరిధిలో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు చేపట్టాలని సూచించారు. దీనికి అనుగుణంగా అమాత్యులు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. ఒక్కో పురపాలికపై కసరత్తు చేపట్టారు. అక్కడ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
- ఉమ్మడి వరంగల్.. కొత్త ఆరు జిల్లాల పరిధిలో పురపాలక ఎన్నికలపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌లు సమావేశాలు జరిపారు.
- పూర్వ మహబూబ్‌నగర్.. నూతన అయిదు జిల్లాల్లో సమావేశాలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు శ్రీకారం చుట్టారు.
- జోగులాంబ-గద్వాల జిల్లా పరిధిలోని ఆలంపూర్ నియోజకవర్గ వడ్డేపల్లి పురపాలక సంఘం పరిధిలో భారీ సభను నిర్వహించారు.
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ నగర పాలక సంస్థ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా శనివారం భారీ మహిళా సదస్సును జరిపారు. మంత్రులు సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డిలు దీనికి హాజరై ఎన్నికల శంఖారావం పూరించారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పురపాలక నేతలతో కేటీఆర్ ఉమ్మడి సమావేశం జరిపారు.
- సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో మంత్రి హరీశ్‌రావు సమావేశాలు నిర్వహించారు.
- మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నేతలతో భేటీలు నిర్వహించారు.
- ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నేతలతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశాలు జరుపుతున్నారు.
- నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి నియోజకవర్గాల్లోని పురపాలికల్లో జగదీశ్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు.
- నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలను ఖరారు చేశారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్షలు చేపడుతున్నారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి