కూలుతున్నది కేవలం సెక్రటేరియట్ మాత్రమే కాదని తెలంగాణ ప్రజల బతుకులని అఖిలపక్ష నేతలు అన్నారు. సచివాలయంలోని వందేళ్లకు పైబడిన జి బ్లాక్ మన చారిత్రక సంపదగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సహా సెక్రటేరియట్ ఉద్యోగుల సాంస్కృతిక సంపద అయిన నల్ల పోచమ్మ గుడి, మసీదులను కూడా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసి... సీఎం కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు అఖిలపక్ష నేతలు చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం, ఎల్ రమణ సంయుక్తంగా... ప్రభుత్వ ధోరణిని నిరసిస్తున్నామని ప్రకటించారు.
హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రజలు భావిస్తే ప్రజాస్వామ్య మనుగడ ఎంత ప్రశ్నార్థకమని భవిషత్య్ ఎంతో అంధకారమవుతుందన్నారు. రాష్ట్రంలో రోజుకు రెండువేల కరోనా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల మీద ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో వారి ఇష్టారాజ్యం సాగుతోందని ఆక్షేపించారు. కరోనా బారిన పడుతున్న పేదల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. తమ సమస్యల గురించి చెప్పుకుందామంటే ఏ దిక్కూలేదని విమర్శించారు. ఇవేవీ పట్టని కేసేఆర్... సచివాలయానికి రూ.560 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ప్రగతి భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్