Telangana MPs On Budget: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజావ్యతిరేక బడ్జెట్ అని రాష్ట్ర ఎంపీలు ఆరోపించారు. సామాన్యులకు ఏ కోణంలోనూ ఆశాజనకంగా లేని బడ్జెట్.. నిరుపయోగమన్నారు. దశదిశాలేని ఈ బడ్జెట్ వల్ల భవిష్యత్తులో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. తెలంగాణకు ముందు నుంచి అన్ని బడ్జెట్లలో అన్యాయమే చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క బడ్జెట్లోనూ ఆశాజనకమైన కేటాయింపులు చేయలేదని దుయ్యబట్టారు.
ఎంతమాత్రం ఉపయుక్తం లేదు..
"కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఎంతమాత్రం ఉపయుక్తంగా లేదు. దశదిశ నిర్దేశం లేకుండా నిరుపయోగంగా బడ్జెట్ ఉంది. పేదలు, మధ్యతరగతి వర్గాలకు దీని వల్ల ఎలాంటి లబ్ధి కలగదు. ధాన్యం సేకరణ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇంత సేకరించాం.. అంత సేకరించామని గొప్పలు పోతున్నారే తప్ప.. ఇప్పటికీ రోడ్ల మీదున్న ధాన్యం సంగతేంటనేది చెప్పలేదు. రాష్ట్రాలకు లక్ష కోట్లు అన్నారే తప్ప.. ఏ రాష్ట్రానికి ఎంత అన్నది స్పష్టత ఇవ్వలేదు." - కే. కేశవరావు, రాజ్యసభ సభ్యుడు.
రచ్చబండలోనూ చర్చించండి..
"కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక, పేదలు, ఉద్యోగులు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక బడ్జెట్. ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపరిచేలా కేంద్ర బడ్జెట్ లేదు. వచ్చే 25 ఏళ్లకు అమృతకాల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా చర్యలు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై రచ్చబండలోనూ చర్చలు జరగాలి. పంటలకు కనీస మద్దతు ధర, ధాన్యం సేకరణపై ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్నారు. సాగు రంగాన్ని పట్టించుకోకుండా అన్నింటినీ డిజిటల్ చేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులపై అన్ని రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి." - నామ నాగేశ్వరరావు, ఎంపీ
ఇదీ చూడండి: