ఐఎంఎస్ మందుల కొనుగోలు కుంభకోణంలో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. కేసులో కీలక నిందితురాలితో ఓ ఐఏఎస్ అధికారి సతీమణి చరవాణిలో మాట్లాడినట్లు అనిశా దర్యాప్తులో తేలింది. కీలక నిందితురాలు కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముతో బంగారం, వజ్రాలు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించడం వల్ల... వాటికి సంబంధించిన లావాదేవీల గురించి ఐఏఎస్ సతీమణి సంభాషించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. నిందితురాలి చరవాణిని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపిన నేపథ్యంలో... ఆ నివేదిక ఆధారంగా విచారణలో కీలక విషయాలు బయటపడనున్నాయి. నివేదిక అనంతరం ఐఏఎస్ సతీమణికి నోటీసు పంపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరగనుంది.
ఐఏఎస్ పాత్రపైన దృష్టి..
కుంభకోణం దర్యాప్తులో భాగంగా కీలక నిందితురాలిని ఓ ఐఏఎస్ అధికారి కాపాడే ప్రయత్నం చేసిన దాఖలాలుండటం వల్ల... ఆయన పాత్రపై కూడా అనిశా దృష్టి సారించింది. దర్యాప్తు ప్రారంభించగానే ఐఏఎస్ అధికారి కీలక నిందితురాలని వెనకేసుకురావడం... దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ ఆయనను పట్టించుకోకుండా విచారణలో ముందుకు వెళ్లడంతో... పెద్ద ఎత్తున జరిగిన కుంభకోణం బయటపడింది.
మొత్తం మీద మందుల కొనుగోలు కుంభకోణంలో కీలక నిందితురాలికి సహకరించిన వారిని ప్రశ్నించేందుకు అనిశా రంగం సిద్ధం చేస్తోంది. ఇదే జరిగితే ఈ స్కాంలో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: ఈఎస్‌ఐ కుంభకోణంలో కొత్తమలుపు... ఈడీ, ఐటీ దర్యాప్తు