ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియపై న్యాయవాది గోపాల్‌శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. చట్టబద్ధత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది... ఆధార్, కులం వంటి వివరాలు అడుగుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వెబ్‌సైట్ ద్వారా వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని... 15 రోజుల్లో వివరాలు నమోదుచేయాలని అంటున్నారని తెలిపారు.
సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేంటని హైకోర్టు అడిగింది. ధరణిలో ఆస్తుల నమోదుకు గడువు లేదని... అది నిరంతర ప్రక్రియని న్యాయస్థానానికి అటార్నీ జనరల్ వివరించారు. చివరి తేదీ లేదన్న ఏజీ వివరణను నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఆ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొని చెప్పాలని ఏజీకి సూచించిన హైకోర్టు... ఆస్తుల నమోదు అంశంపై విచారణ మధ్యాహ్నం ఒకటిన్నరకు వాయిదావేసింది.
ఇదీ చదవండి : వాహనాలకు వరద పోటు.. సర్వీసింగ్ సెంటర్లకు క్యూ...