రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు ప్రశ్నలను న్యాయస్థానం సంధించింది. తమ ఆదేశాల్లో కొన్నింటిని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీసింది.
ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఎక్కడ..
ప్రైవేటులో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా?.. ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ఠ ధరలు సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా... అని న్యాయస్థానం ప్రశ్నించింది. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదంది. 14 కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు (RTPCR LABS) ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రశ్నించింది. మరికొన్ని ఆదేశాలు అమలు గురించి నివేదికలో వివరించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని భవిష్యత్‌లోనే చేస్తారా?.. ఇప్పుడేమీ చేయడం లేదా.. అంటూ అసహనం వ్యక్తం చేసింది.
నిలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా..?
కొవిడ్ మూడో వేవ్ సన్నద్ధతపై (CORONA THIRD WAVE)వివరాలు సమగ్రంగా లేవని.. మూడో వేవ్ వస్తే నిలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా?.. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు చర్యలు తీసుకున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8 వేల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది.
బంగారం తాకట్టు పెడుతున్నారు..
లైసెన్సు రద్దు అయిన ఆస్పత్రుల వాళ్లు బాధితులకు సొమ్ము తిరిగి చెల్లించారా? అని ధర్మాసనం ఆరా తీసింది. బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. డీహెచ్ ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరు కాలేదని.. ఏజీ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా తెలంగాణకు కేటాయించిన బ్లాక్‌ఫంగస్ ఔషధాలు (BLACK FUNGUS) ఎందుకు పంపలేదో తెలపాలని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది.
ఇవీచూడండి: Bird Flu: ప్రపంచంలో తొలిసారి మనిషికి...