GO no 317: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కోరారు.
కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని.. అదనపు ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం.. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులన్నీ పిటిషన్లపై తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ విచారణ ఏప్రిల్4కు వాయిదా వేసింది.
కొనసాగుతున్న ఆందోళనలు
మరోవైపు... 317 జీవోపై ప్రభుత్వ ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో ప్రకారం స్థానికతకు ప్రాధాన్యమివ్వాల్సి ఉండగా... అది ఎక్కడా పాటించలేదని ఆరోపిస్తున్నారు. దంపతులను ఉమ్మడి జిల్లాలో కాకుండా ఇతర జోన్లకు కేటాయించారని ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ సహృదయంతో తమ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు వేడుకుంటున్నారు.
జాబితాలో తప్పులను సవరించాలని
సీనియారిటీ జాబితాలో తప్పులను సవరించాలని, జోన్, మల్టీ జోన్ పోస్టుల వర్గీకరణలో సమన్యాయం పాటించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్కే భవన్ ఎదుట ప్రధానోపాధ్యాయులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇతర జోన్లు కేటాయించారంటూ కొద్ది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా... పట్టించుకునే నాథుడ లేరని వాపోయారు. ఇతర జోన్లకు బదిలీ అయిన వారిలో 40 మంది హెడ్‌మాస్టర్లు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : 'మల్టీ జోన్లలో ఖాళీలున్నా.. మమ్మల్ని గోస పెడుతున్నారు'