regularizing lands of poor: రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో పేదల అధీనంలో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇచ్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. పేదలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల జాగాలను క్రమబద్ధీకరించాలని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయించగా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది.
కటాఫ్ తేదీ ఎప్పటి వరకు..
గతంలో జీవో 58 ద్వారా ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పుడు 125 చదరపు గజాల వరకు ఉచిత క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. తాజాగా ఎంత విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి.. ఎప్పటి వరకు కటాఫ్ తేదీని నిర్ణయించాలనే అంశాలను పరిశీలిస్తున్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రశీదు, తాగునీరు, విద్యుత్ బిల్లు వంటి వాటిలో ఏదో ఒకటి ప్రధాన ఆధారంగా పరిగణించనున్నారని తెలుస్తోంది.
రెండు నెలలక్రితం మండలాల వారీగా...
వ్యక్తిగత వివరాల అంశంలో ఆధార్‌కార్డు సహా ప్రభుత్వ ధ్రువీకరణకు ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రణాళికాబద్ధ అభివృద్ధి, మౌలికసదుపాయాల విస్తరణ అనే ప్రాథమిక అంశాల ప్రాతిపదికగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లోని ఇళ్లు ఎన్ని? విభజనకు పూర్వం ఇచ్చిన 166 జీవో కింద వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉన్న వాటి మాటేమిటి? 58, 59 జీవోల ఆధారంగా వచ్చిన వాటిలో అపరిష్కృతంగా ఉన్నవి ఎన్ని.. ఇలాంటి అన్ని వివరాలను ప్రభుత్వం రెండు నెలలక్రితం మండలాల వారీగా సేకరించింది.
2014 డిసెంబరులో జారీ చేసిన 58, 59 జీవోల ఆధారంగా వచ్చిన దరఖాస్తుల్లో నిబంధనల మేరకు 25 శాతంలోపే ఉండగా వాటిని క్రమబద్ధీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.46 లక్షల దరఖాస్తులు రాగా 1.04 లక్షలకు పట్టాలను జారీ చేశారు.
ఇదీ చూడండి: Lands auction in telangana: సర్కార్ స్థలాలకు మళ్లీ వేలం