illegal constructions in hyderabad: హెచ్ఎండీఏ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాల్టీల కమిషనర్లకు పురపాలకశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, లేఅవుట్లు వెలుస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్న పురపాలకశాఖ... గతంలో ఉన్న పంచాయతీల పేరిట అనుమతులు ఉన్నట్లు కొందరు చూపుతున్నట్లు సమాచారం ఉందని తెలిపింది. కేవలం రెండంతస్థుల వరకు మాత్రమే పంచాయతీలకు గతంలో హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిందని... అపార్టుమెంట్లు, గెటెడ్ కమ్యూనిటీలకు ఇవ్వలేదని స్పష్టం చేసింది.
municipal department Directions: వీటన్నింటి నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాల్టీల కమిషనర్లందరూ తమ తమ పరిధిలో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించాలని పురపాలకశాఖ ఆదేశించింది. అనుమతులు ఉన్నాయో..? లేదో..? పరిశీలించాలని సూచించింది. అనుమతులు లేకపోతే పురపాలక, టీఎస్‌బీపాస్ చట్టాల ప్రకారం వెంటనే తగిన చర్యలు తీసుకొని వాటిని కూల్చివేయాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో తీసుకున్న చర్యల నివేదికను నెలాఖరులోపు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని మున్సిపల్ కమిషనర్లకు స్పష్టం చేసింది.
ఆదేశాలను కచ్చితంగా పాటించాలని.. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మున్సిపల్ కమిషనర్లను వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేయడంతో పాటు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మెమో జారీ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లకు కూడా ప్రతులు పంపారు.
ఇదీ చూడండి: