కరోనా తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కష్టమేనని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయనున్నట్లు తెలిసింది. దీనిపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయపరమైన సమస్యలు రాకుండా అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకొని రద్దు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సైతం సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే దిశగా ఆలోచనలు చేసిన ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది.
రద్దు చేయాలని డిమాండ్
ఈనెల 18వ తేదీన మార్చి పరీక్షల ఫలితాలను విడుదల చేయగా.. అదేరోజు సప్లిమెంటరీ పరీక్షల కాలపట్టికను విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు సమాయత్తమైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయిద్దామని అన్నట్లు సమాచారం. ఇంటర్ విద్య ఐకాసతో పాటు ఇంటర్ విద్య పరిరక్షణ సమితి, ఇతర సంఘాలు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల్లో తప్పినవారు దాదాపు 3.25 లక్షల మంది ఉన్నారు. పరీక్షల రద్దుపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ను వివరణ కోరగా తనకు సమాచారం లేదన్నారు.
అప్పుడే కష్టమైతే.. ఇప్పుడు ఇంకా కష్టం!
పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్న సమయంలో కేసులు రోజుకు 100 మాత్రమే. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కేసులు నాలుగైదు రెట్లు పెరిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజుకు 300 కేసులు దాటుతున్నాయి. వాస్తవానికి ఇంటర్ విద్యార్థుల సంఖ్య హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ. ఈ మూడు జిల్లాల్లో ద్వితీయ ఇంటర్ తప్పిన వారు దాదాపు 60 వేల వరకు ఉన్నారు. మొదటి ఏడాది ఇంప్రూవ్‌మెంట్ రాసేవారే లక్ష దాటుతారు. ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయంలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.
సప్లిమెంటరీ పరీక్షలను ఉదయం ఇంటర్ ప్రథమ, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుపుతారు. అందుకు ఏడెనిమిది రోజులు పడుతుంది. రోజుకు ఒక సంవత్సరం విద్యార్థులకే పరీక్ష జరపాలి. మొత్తం పరీక్షలు పూర్తి కావాలంటే 16-18 రోజులు పడుతుంది. ఇదంతా కష్టంతో కూడుకున్నది.
ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103