కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రాష్ట్రంలో పంటల కొనుగోలు విధానంలో మార్పులు రానున్నాయి. వచ్చే ఏడాది నుంచి నేరుగా మద్దతుధరకు పంటలు కొనేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కొత్త చట్టాల ప్రకారం రైతుల నుంచి ఎవరైనా ఎక్కడైనా పంటలు నేరుగా కొనవచ్చు. కానీ, వ్యవసాయ మార్కెట్లను యథాతథంగా కొనసాగించవచ్చని చట్టాల్లో స్పష్టం చేసినందున వాటిని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేయాలని మార్కెటింగ్ శాఖను తాజాగా ఆదేశించింది.
ఇంతకాలం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 189 వ్యవసాయ మార్కెట్లలోనే పంటల కొనుగోళ్లు జరుగుతున్నాయి. వీటిలోనూ 120 మార్కెట్లకే పంటలు వస్తుంటాయి. వీటితోపాటు ఈ మార్కెట్లకు అనుబంధంగా చిన్న గ్రామాల్లో ఉన్న ఉప(సబ్) మార్కెట్‌యార్డులు, గోదాముల వద్ద కూడా పంటల కొనుగోలుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సూచించింది. ఇవన్నీ కలిపితే దాదాపు 550 వరకూ మార్కెట్లుగా పనిచేస్తాయి.
కొత్త చట్టాల ప్రకారం ఆధార్ వంటి గుర్తింపు కార్డు ఉన్న ఏ వ్యక్తి అయినా తనకున్న స్థలంలోనే నేరుగా పంటల కొనుగోలు మార్కెట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా మార్కెట్ ఏర్పాటు చేయడానికి మార్కెటింగ్‌శాఖకు దరఖాస్తు చేయాలి. ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రైవేటు మార్కెట్ల ఏర్పాటుకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలోకి వచ్చిన పంటలను కొంటే పంట విలువలో ఒకశాతం సొమ్మును ‘మార్కెట్ రుసుం’గా చెల్లించాలి. మార్కెట్ బయట ఏ పంటను ఎంత మొత్తంలో కొన్నా రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని కొత్త చట్టాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో వ్యాపారులు మార్కెట్ల బయట కొనడానికే ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో వారు సొంతంగా మార్కెట్లను సైతం ఏర్పాటు చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే రైతులకు దగ్గరగా వ్యవసాయ మార్కెట్లు ఉంటే ప్రైవేటు మార్కెట్లవైపు వారు వెళ్లరని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 189 వ్యవసాయ మార్కెట్లు ఉండగా, అన్నీ పూర్తిస్థాయిలో రోజూ పనిచేయడం లేదు. రాష్ట్రంలో 590 మండలాలు ఉన్నందున మండలానికి ఒకటి తప్పనిసరిగా మార్కెటింగ్‌శాఖకు చెందిన వ్యవసాయ మార్కెట్ ఉండేలా చేసి పంటల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తే రైతులు పంటలు అక్కడికే తెస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పత్తి పంటను గోదాముల వద్ద ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ) మద్దతు ధరకు కొనేందుకు అప్పుడప్పుడు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనేందుకు కొనుగోలు కేంద్రాలూ అక్కడే ఏర్పాటుచేస్తున్నారు. భవిష్యత్తులో వాటిని శాశ్వత వ్యవసాయ మార్కెట్లుగా మార్చి అక్కడే రైతుల పంటలను వ్యాపారులతో కొనుగోలు చేయించేలా మార్కెటింగ్ వ్యవస్థను మార్చాలనేది వ్యూహం.
పరిశోధన, విశ్లేషణ విభాగానికి నిపుణుల నియామకం: కొత్త చట్టాల్లో మద్దతు ధరకు పంటలు కొనడంపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. గతేడాది కరోనా, లాక్‌డౌన్ కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఇలా సాధ్యం కాదని, మార్కెట్లకు తెచ్చే పంటలనే కొనాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్లను పటిష్ఠం చేసి మౌలిక సదుపాయాలన్ని కల్పించాలని భావిస్తోంది. పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనదు. కేంద్రం ఆదేశిస్తే మాత్రం వాటికోసం వ్యవసాయ మార్కెట్లలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. త్వరలో మార్కెటింగ్‌శాఖతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై పంటల కొనుగోలు, మార్కెట్ల బలోపేతం ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారు. పంటల ధరలు ఎప్పుడెలా ఉంటాయి, ఏ పంట వేస్తే ఎంత ధర వస్తుందనే వివరాలను రైతులకు చెప్పేందుకు మార్కెటింగ్‌శాఖలోనే ‘పరిశోధన, విశ్లేషణ విభాగం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం నిపుణులను నియమించనున్నారు.
- ఇదీ చూడండి : నేడు పీఆర్సీ నివేదిక విడుదలయ్యే అవకాశం