TS Govt Appeal to Stop Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. పాదయాత్ర ఆపాలని పోలీసులిచ్చిన నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి నిన్న సస్పెండ్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం రెండున్నరకు విచారణకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అంగీకరించింది.
ఆగస్టు 23న బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని... ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
అయితే పాదయాత్రను అనుమతించాలంటూ హైకోర్టులో భాజపా నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసు సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ధర్మస్థానం అనుమతితో.. బండి సంజయ్ నేడు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. మొన్న ఆపేసిన ఉప్పుగల్ సమీపంలోని శిబిరం నుంచే యాత్రను తిరిగి ప్రారంభించారు. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు పాదయాత్ర సాగనుంది.