రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న భేటీలో ప్రధానంగా వివిధ చట్టాల సవరణ ముసాయిదా బిల్లులపై చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ రాజ్, పురపాలక చట్టాల తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో పనిచేసేలా చట్టంలో నిబంధనలు పొందుపర్చనున్నారు. పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం, హరితబడ్జెట్ తదితర అంశాలు కూడా చట్టసవరణలో ఉండనున్నాయి.
సీఆర్పీసీ చట్టానికి సవరణలు..
కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో ఆస్తుల విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాన్ని తొలగిస్తూ.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి కూడా సవరణ చేయనున్నారు. హైకోర్టు సూచించిన విధంగా సీఆర్పీసీ చట్టానికీ సవరణలు చేయనున్నారు. ఈ చట్టసవరణల ముసాయిదా బిల్లులపై సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేస్తారు. అనంతరం మంగళవారం శాసనసభలో ఈ బిల్లులను ప్రవేశపెడతారు. కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తులను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో పేదలకు సంబంధించిన ఇళ్లు, ధీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే అవసరమైన కసరత్తు చేసింది. దీంతో ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో అందుకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
పంటల కొనుగోళ్లు, యాసంగి సాగుపై..
వానాకాలం పంటల కొనుగోళ్లు, యాసంగిలో నిర్ణీత విధానంలో సాగు అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. వరిధాన్యం సహా పత్తి, కందులను ప్రభుత్వ సంస్థల నుంచే పూర్తిగా కొనుగోలు చేయాలని, కరోనా ముప్పు దృష్ట్యా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు వీలైనంత త్వరగా చెల్లింపులు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటన్నింటికి సంబంధించి కేబినెట్‌లో మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశానికి ముందు ఈ మధ్యాహ్నం పంటల కొనుగోళ్లు, యాసంగి సాగుపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: ఇటీవలి సెషన్స్ కు కొనసాగింపుగానే సమావేశాలు'