Telangana Cabinet Meeting: రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ వేదికగా సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ఆమోదం అంశమే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశమవుతోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దుపై చర్చించి.. ఆమోదించేందుకు రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై సాయంత్రం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
మంత్రులకు దిశానిర్దేశం..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో పాటు బడ్జెట్ కేటాయింపులు, తదితర అంశాలను మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించనున్నారు. 2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి చివరి బడ్జెట్ అయిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ, అమలు తీరుతెన్నులపై అమాత్యులకు వివరిస్తారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో విపక్షాలను ఎదుర్కోవడం, వారు లేవనెత్తే అంశాలకు దీటైన సమాధానాలు ఇవ్వడం, స్పందించడంలాంటి అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం, మన ఊరు - మన బడి ప్రారంభం, యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ సహా ఇతర అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అటు రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపై చర్చ..
రాష్ట్ర, కేంద్ర రాజకీయాలు, నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. దేశంలో ప్రబలమైన గుణాత్మక మార్పే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల ముంబయి, దిల్లీ, రాంచీలో పర్యటించారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు ఉద్దవ్ థాకరే, హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, భాజపా ఎంపీ సుబ్రమణ్యస్వామి, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. తన ఆలోచనలు, ప్రణాళికలను వారికి వివరించిన ఆయన... భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు.
త్వరలోనే వ్యవసాయం, విద్యుత్ అంశాలపై హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులతోనూ సమావేశం నిర్వహిస్తానని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవలి పర్యటనలు, నేతలతో చర్చల సారాంశాన్ని మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు తన ప్రణాళికలు, ఆలోచనలను కూడా వారితో పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: