గాంధీభవన్‌లో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో తెజస, వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అక్టోబరు 2 నుంచి జరగనున్న కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్, విద్యార్థి పోరుపై ఈ సమావేశంలో చర్చించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన రోజు వరకు 67 రోజులపాటు జనంలోకి వెళ్లేందుకు రూపొందించిన కార్యాచరణపై మాట్లాడారు.
అక్టోబర్ 5న జరిగే పోడు భూముల పోరుపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేత మల్లు రవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తెజస నాయకులు పాల్గొన్నారు.
పాలకుల నిర్లక్ష్యం, నియంత పోకడలపై అందరం కలిసి పోరాటం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలు, పోడు భూముల సమస్యపై కాంగ్రెస్ పార్టీ చేయనున్న పోరాటానికి సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ, తెజస పార్టీలు మద్దతు ఇస్తామని మాటిచ్చాయని చెప్పారు. అక్టోబర్ 2నుంచి జరిగే విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాటాని అందరూ తరలిరావాలని కోరారు.
"తెలంగాణ కోసం అందరం కలిసి పోరాటం చేశాం. తెలంగాణ పోరాట లక్ష్యాలు నెరవేరలేదు. రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వట్లేదు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు కూడా పూర్తి చేయట్లేదు. డీఎస్సీ, టీపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. పాలకుల నియంత పోకడలపై కలిసి పోరాటం చేస్తాం. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి కలిసి రావాలి."
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత