విశాఖ రైల్వే జోన్కు నిధులు, కడప స్టీల్ ప్లాంట్, విసీఐసీ, బిసీఐసీ ఏమయ్యాయో.. పెట్రోలియం కాంప్లెక్స్, తొలి ఏడాది ఆర్థిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమైనా అడిగారా? అని ఏపీ సీఎం జగన్ను తేదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. అప్పుడు మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజేం చెప్పారు? ఈ రోజేం చేస్తున్నారని ఆక్షేపించారు.
వ్యాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలనే మరో జగన్నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 25నుంచి కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ అంటూ దొంగ ట్వీట్లు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే ఓటమి ఎదురవుతుందనే.. వ్యాక్సిన్ పంపిణీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. స్థానిక ఎన్నికలకు తెదేపా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైకాపా దాడులు, దౌర్జన్యాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.