ఏపీలో రెండో దఫా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశలో 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు...175 మండలాల్లో సందడి నెలకొంది. కృష్ణా జిల్లాలో రెండో విడతలో చివరిరోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అరవపల్లిలో నామినేషన్ల వేళ... తెలుగుదేశం, వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగాయి. నామినే।షన్ వేసేందుకు వెళ్తున్న తెలుగుదేశం వర్గీయులను.. వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటంతో... పలువురు గాయపడ్డారు.
ఏకగ్రీవాలకే మొగ్గు..
ప్రకాశంజిల్లాలో చివరిరోజు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. చినగంజాం మండలం నీలాయపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం కానున్నట్లు అధికారులు తెలిపారు. పంచాయతీలో ఆరు వార్డులుండగా.. ఒక్కొక్కరే బరిలో ఉండటంతో అవి కూడా ఏకగ్రీవం కానున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని యర్రంవారిపాలెం సర్పంచ్ పదవి మరోసారి ఏకగ్రీవమైంది. ప్రస్తుతం ఈవూరి మాధవి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటాపోటీగా నామపత్రాలు సమర్పించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 13మండలాల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగింది.
కోలాహలంగా..
రెండోదశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తుది రోజు కావటంతో...తూర్పు గోదావరి జిల్లాలో నామినేషన్ కేంద్రాలు కోలాహలంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లో అభ్యర్థులు ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఉండ్రాజవరంలో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో చివరిరోజు నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగింది.
అభ్యర్ధి అదృశ్యం..
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం మద్దతుదారుడైన సర్పంచి అభ్యర్థి అదృశ్యం....... కలకలం రేపుతోంది. నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లి పంచాయతి ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థిగా తెలుగుదేశం మద్దతుతో ఓబుల్ రెడ్డి నేడు నామినేషన్ వేయాల్సి ఉంది. ఉదయం నుంచి ఓబుల్ రెడ్డి కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్‌ల ఉండటం...ద్విచక్రవాహనం ఇంటివద్దే ఉండటంతో అనుమానాలకు తావిస్తోందని గ్రామస్థులు ఆరోపించారు.
ఆత్మహత్యాయత్నం..
అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం పంచాయతీలో వైకాపా మద్దతుదారు మంజుల పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైకాపా మద్దతుతో ఈనెల 2న మంజుల నామినేషన్ వేయగా...నేడు మరో మహిళతో నామినేషన్ వేయించేందుకు వైకాపా నేతలు సిద్ధమయ్యారు. మనస్థాపం చెందిన మంజుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఓవైపు రెండోదశ నామినేషన్ల ప్రక్రియ ముగియగా....సర్పంచ్, వార్డు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రజాప్రతినిధుల కేసులపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు