రాష్ట్రంలో గత యాసంగిలో కోటీ 19 లక్షల టన్నుల ధాన్యం వచ్చింది. అందులో కేవలం 17.65 శాతమే సన్నరకాలని మార్కెటింగ్‌శాఖ అధ్యయనంలో తేలింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనే ధాన్యంలో దొడ్డు రకాలకు ఏ గ్రేడ్ కింద క్వింటాకు రూ.1,888, సన్నాలకు రూ.1,868 ఇస్తోంది. సన్నాలు దిగుబడి పెద్దగా రావని, కష్టం ఎక్కువని, ధర కూడా తక్కువగా ఉన్నందున దొడ్డు రకాలనే రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల మొత్తం 9.25 లక్షల టన్నుల వరిధాన్యం ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి కొనగా... వాటిలో 7.70 లక్షల టన్నులు సన్నాలే.
వాస్తవంగా రాష్ట్రంలో ఏడాదికి సుమారు 30 లక్షల టన్నుల బియ్యం అవసరం. గతేడాది రెండు సీజన్లలో కలిపి 25 లక్షల టన్నులే లభించింది. స్థానిక డిమాండ్‌కు... లభ్యతకు వ్యత్యాసం వల్లే బియ్యం ధరలు ఎక్కువగా ఉంటున్నాయని ఒక అధికారి విశ్లేషించారు. ఒక కిలో సన్న బియ్యానికి రైతుకు దక్కుతున్నది రూ.28.73 అయితే బహిరంగ మార్కెట్‌లో వినియోగదారు రూ.55 దాకా చెల్లించాల్సి వస్తోంది.
దేశానికి దిక్సూచిగా...
మరోవైపు ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో కనీవినీ ఎరుగని ప్రగతి సాధించి తెలంగాణ రాష్ట్రం... దేశానికి దిక్సూచిగా నిలిచింది. 2014-15లో వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి 35 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా... 2020-21లో కోటి 6 లక్షల ఎకరాల్లో వరిని పండించారు. 2014-15 ఏడాదిలో పౌరసరఫరాల సంస్థ రెండు సీజన్లకు కలిపి 24.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే... ఈ ఏడాది కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి చరిత్ర నెలకొల్పింది.
587 శాతం పెరిగిన కొనుగోళ్లు...
ఒక్క యాసంగి గమనిస్తే 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే... ప్రస్తుతం 90 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే 587 శాతం కొనుగోళ్లు పెరిగాయి. వీటిలో 17.65 శాతమే సన్నరకాలు ఉన్నాయి. 2019-20 వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి కోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు. తాజాగా ఆ రికార్డును అధిగమించి సరికొత్త మైలురాయిని చేరింది. ప్రస్తుతం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో మరో 50 నుంచి లక్ష మెట్రిక్ టన్నుల వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని... ఇటీవల పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
13వేల 753 కోట్లు జమ...
రాష్ట్రవ్యాప్తంగా 6వేల 967 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరిపారు. 14.21 లక్షల మంది రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతుల ఖాతాల్లో 13వేల 753 కోట్లు జమ చేశారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం పలు సమస్యలు తలెత్తినప్పటికీ... వాటిని అధిగమించి ధాన్యం కొనుగోళ్లు జరిగాయని పౌరసరఫరాల సంస్థ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తండ్రి అయ్యాకే తెలుస్తుంది నాన్న అంటే ఏమిటో..