భాగ్యనగరంలో రాత్రిపూట చెవులకు చిల్లులు(Noise pollution) పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే పగలు కాకుండా రాత్రి శబ్ద కాలుష్యం(Noise pollution) అధికంగా నమోదవుతున్నట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ(Telangana State Pollution Control Board)) అధ్యయనంలో వెల్లడయ్యింది. సున్నిత ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం గమనార్హం.
తొమ్మిది చోట్ల లెక్కింపు...
వాణిజ్య, నివాసిత, పారిశ్రామిక, సున్నిత ప్రాంతాలుగా వర్గీకరించి శబ్ద కాలుష్యాన్ని లెక్కిస్తారు. సీపీసీబీ నిర్దేశిత పరిమితులు ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. జూబ్లీహిల్స్, తార్నాక(నివాసిత), ఆబిడ్స్, జేఎన్టీయూ, ప్యారడైజ్(వాణిజ్య), సనత్‌నగర్, జీడిమెట్ల (పారిశ్రామిక), జూపార్క్, గచ్చిబౌలి (సున్నిత)లో శబ్ద తీవ్రతను నమోదు చేస్తున్నారు.
పెరిగితే ఇబ్బందేంటి...
శబ్ద కాలుష్యం(Noise pollution) చిరాకు, ఆందోళనకు కారణమవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత లోపించి రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే రక్తపోటు పెరగడం, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కడెలా ఉంది..
సున్నిత ప్రాంతాలైన జూపార్క్, గచ్చిబౌలిలో రాత్రిపూట పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిర్దేశిత పరిమితుల కంటే జూపార్క్‌లో పగలు 8, రాత్రి 19 డెసిబుల్స్ అధికంగా నమోదయ్యింది. గచ్చిబౌలిలో పగటిపూట 9, రాత్రిపూట 15 డెసిబుల్స్ చొప్పున ఎక్కువగా నమోదైనట్లు తేలింది.
నివాస ప్రాంతాలైన జూబ్లీహిల్స్‌లో పగలు 3, రాత్రి 12, తార్నాకలో పగలు 6, రాత్రి 13 డెసిబుల్స్ చొప్పున అధికంగా ఉండటం గమనార్హం. వాణిజ్య ప్రాంతాల్లోనూ పగలు 4, రాత్రి 11-15 డెసిబుల్స్ చొప్పున ఎక్కువగా నమోదైంది.
పారిశ్రామిక ప్రాంతాల్లో నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగానే ఉంది. కాకపోతే.. జీడిమెట్లలో పగలు కంటే రాత్రిపూటే అధికంగా ఉంది.
ఎందుకిలా...
ఇతర ప్రాంతాల నుంచి సరకుల్ని మోసుకొచ్చే భారీ వాహనాలు, ట్రావెల్స్ బస్సుల రాకపోకలు రాత్రిపూటే ఎక్కువగా ఉంటాయి. వీటి హారన్ల మోతతోనే శబ్ద కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్నట్లు పీసీబీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిర్మాణ పనులు కూడా కారణమై ఉండొచ్చని వివరిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తేనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

