రంగుల సోడాలాగా ఈ కలర్డ్ వాటరేమిటా అనిపిస్తోంది కదూ. నిజమే కానీ ఈమధ్య హాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ నీళ్లను తాగడంతో ఇదో ట్రెండయిపోయింది. సూర్య కిరణాలవల్ల నీళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుందన్న కారణంతో చైనా, భారత్, ఈజిప్టు సంప్రదాయ వైద్యులు ఈ నీటిని తాగమనేవారట. దానికే ఇప్పుడు కలర్‌థెరపీని జోడించి, వ్యాధుల్నీ తగ్గించవచ్చు అంటున్నారు. దాంతో కంపెనీలు ప్రత్యేకంగా గాజు సీసాల్ని తయారుచేస్తున్నాయి. పైగా ఈ పద్ధతిలో నీటిని చర్య పొందించడం వల్ల ఇతరత్రా పద్ధతుల్లో వడబోసిన నీటిలోగానీ మినరల్ వాటర్‌లోగానీ ఇంకా ఎక్కడైనా బ్యాక్టీరియా మిగిలి ఉంటే అదీ పోతుందట.
ఎందుకు మంచిది?
భోజనం ప్లేటులో అన్ని రంగులూ ఉండాలన్నట్లే తాగే నీరూ అలాగే ఉండాలనేది క్రోమోథెరపిస్టుల ఉవాచ. అంటే- నీటిని రకరకాల రంగుల బాటిళ్లలో నింపి ఎండలో పెట్టడం వల్ల ఒక్కో రంగూ ఒక్కో తరంగధైర్ఘ్యం ఉన్న కాంతిని గ్రహిస్తుంది. ఆ విధంగా అనేక రోగాల్ని నివారించుకోవచ్చు. నీలం రంగు నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరిస్తే, ఊదా రంగు సీసాలోని నీళ్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లని నివారించడంతోపాటు నాడులకీ స్వాంతన కలిగిస్తాయట. ఎరుపు వర్ణం రక్తప్రసరణను పెంచడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే మంచిదట. పసుపు రంగు ఆకలిని తగ్గిస్తుందన్న కారణంతో బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ నీళ్లను భోజనానికి ముందు తాగుతున్నారట. ఆకుపచ్చ రోగనిరోధకశక్తిని పెంచితే, నారింజ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బీపీని తగ్గించడానికి గులాబీ రంగూ, థైరాయిడ్ సమస్యలకి లేత నీలి రంగూ; చర్మసమస్యలకి ఊదా ఎరుపూ కలగలిసిన మెజెంతా మంచివి అంటున్నారు కలర్‌థెరపిస్టులు. అంతేనా... కొవిడ్-19ను నిరోధించేందుకూ ఈ సోలరైజ్‌డ్ వాటర్ తోడ్పడుతుందట. ఎందుకంటే- కరోనాకి డి3 విటమిన్ సహజ మందు. శరీరంలో ఉత్పత్తయ్యే ఈ విటమిన్‌కి సూర్యరశ్మి అవసరం. అది తగలకే దాదాపు వంద కోట్ల మంది డి3 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అందుకే ఏసీలో ఉన్నవాళ్లతో పోలిస్తే ఎండలో పనిచేసే వాళ్లకి ఈ వైరస్ తక్కువగానే సోకింది. కాబట్టి ఎండలో ఉంచిన ఈ నీరు, డి3 తయారీకీ తోడ్పడుతుంది. కాబట్టి సోలరైజ్‌డ్ వాటర్ మంచిదే అంటున్నారు. కొందరు ఆధునిక వైద్యులు.
సోలరైజ్డ్ నీటికోసం రంగుల సీసాలతోపాటు ఫిల్టర్లూ దొరుకుతున్నాయి. కలర్డ్ ఫిల్టర్ కాగితాన్ని గ్లాసుకి చుట్టి దానికో రబ్బరు బ్యాండు పెట్టి, అందులో నీళ్లు పోసి ఎండ పడే ప్రాంతంలో ఉంచాలి. బాటిల్ అయితే నేరుగా ఎండలో పెట్టుకోవచ్చు. అయితే గ్లాసు లేదా సీసా ఏదయినాగానీ- దానిమీద పలుచని కాటన్ బట్టతో మూతిని కట్టేయాలి. సీసాకయితే కార్క్(బెండు)ముక్కను పెట్టినా సరిపోతుంది. దీనివల్ల గాల్లోని హానికర బ్యాక్టీరియా అందులోకి చేరదు. వేసవిలో గంటారెండు గంటలు సరిపోతుందికానీ చలికాలంలో రోజంతా ఉంచాలి. ఈ సోలరైజ్‌డ్ వాటర్‌కోసం గాజుతో చేసిన సీసాలైతేనే మేలు. ప్లాస్టిక్కువి ఎండలో ఉంచితే వాటిల్లోని టాక్సిన్లు నీటిలో కలిసే అవకాశం ఉంది. అదండీ సంగతి... రోగనివారణ సంగతెలా ఉన్నా ఆకర్షణీయమైన రంగుల సీసాల్లో నీళ్లు తాగడం ఎవరికైనా ఆనందాన్నే కలిగిస్తుంది. కాబట్టి తాగేస్తే పోలా!