రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో తొలుత తొమ్మిదో తరగతి, ఆపై తరగతులను ప్రారంభించారు. మిగతా తరగతులకు ప్రత్యక్ష బోధన లేకపోవడంతో ఆ గదులను వినియోగించుకున్నారు. తాజాగా ఐదో తరగతి మినహా పీజీ వరకు అన్ని తరగతులకు అనుమతి ఇచ్చారు. కొత్తగా ఏర్పాటైన గురుకులాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండటం వల్ల భౌతిక దూరం ప్రధాన సమస్యగా మారుతోంది. ఒకే తరగతి గదిలో ఉదయం పాఠాల బోధన, రాత్రి వసతి ఉంటోంది. ఇప్పటివరకు తరగతి గదికి 20 మంది చొప్పున విద్యార్థులు ఉండగా.. మిగతా తరగతుల విద్యార్థులూ రావడంతో 40 మంది విద్యార్థులను అనుమతించాల్సి ఉంటుందని సొసైటీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక దూరం అమలుపై గురుకులాల ప్రిన్సిపళ్లకు సంక్షేమ సొసైటీల అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
14 రోజుల క్వారంటైన్...
గురుకులాల్లో చేరేందుకు వస్తున్న 6, 7, 8 తరగతుల విద్యార్థులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఐదు రోజులు పరిశీలించిన తరువాత వారిని ప్రత్యేక గదిలోకి తీసుకువస్తారు. క్వారంటైన్ గడువు ముగిసిన తరువాత సాధారణ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సొసైటీల అధికారులు సూచించారు. ఉపాధ్యాయులకు ప్రతిరోజూ వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరమే గురుకులంలోకి అనుమతిస్తున్నారు. ఒకసారి విద్యార్థులు గురుకులాల్లో చేరిన తరువాత అత్యవసర పరిస్థితుల్లో మినహా తల్లిదండ్రులు, బంధువులను కలిసేందుకు అనుమతి ఇవ్వకూడదని సొసైటీలు ఆదేశించాయి.