కరోనా ప్రభావం నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా వ్యాపార సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. చిన్నపాటి దుకాణదారుల నుంచి బడా సంస్థల వరకు యాప్‌ల బాట పడుతున్నాయి. తమ వ్యాపారానికి అనుగుణంగా మొబైల్ యాప్‌లను రూపొందించుకుంటున్నాయి. వినియోగదారుల సెల్‌ఫోన్ నంబర్లను సమీకరించి యాప్‌లతో అనుసంధానించుకుంటున్నాయి. అదనపు ధరలేవీ లేకుండానే సేవలందిస్తున్నాయి.
దుకాణ యాప్‌లకు గిరాకీ
కరోనా కారణంగా దుకాణాలకు సంబంధించిన పెరిగింది. ఒక్కో యాప్ తయారీకి రూ.లక్షలు వ్యయం చేస్తున్నారు. కొన్ని మొబైల్ యాప్‌లను పేజీలవారీగా వినియోగించుకునేందుకు దుకాణాల యజమానులు బృందంగా ఏర్పడుతున్నారు. దీనివల్ల ఒక్కో దుకాణానికి రూ.50 వేల వరకే వ్యయమవుతోందని చెబుతున్నారు. కొందరు మాత్రం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యయం చేసి కొనుగోలు చేస్తున్నారు. యాప్‌ల వినియోగం ఎక్కువవడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు గిరాకీ పెరిగింది. గత పదిరోజుల్లో తనకు రూ.15 లక్షల ఆర్డర్లు వచ్చాయని భాను అనే ఇంజినీర్ ‘ఈనాడు’కు తెలిపారు. ఏడాదంతా నిర్వహించేందుకు కూడా కొంత మొత్తం తీసుకుంటామని వివరించారు.
సెల్ మీట నొక్కితే చాలు.. ఇంటికే సరకులు
యాప్‌లో ఎంపిక చేసుకున్న సరకులను ఇంటికి తెచ్చిపెట్టేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్దపెద్ద మాల్స్ యాప్‌లు, వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు చిన్నదుకాణాల వాళ్లు కూడా ఈ బాటపట్టారు. రోడ్డుపై దుకాణం అక్కర్లేదని, గోదాంలోనే ప్యాకింగ్ చేసి ఇంటికి పంపిస్తామని ఖైరతాబాద్‌లో దుకాణం నిర్వహిస్తూ ‘మై దుకాణ’ యాప్‌ను వినియోగంలోకి తెచ్చిన వ్యాపారి చంద్రశేఖర్ తెలిపారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా పే యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకుంటామని వివరించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...